టి.అసెంబ్లీ..సిక్స్త్ డే..

21:14 - November 3, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటు అంశంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా సాగాయి. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్‌, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేసి నిరసన తెలిపారు. కేసీఆర్‌ కిట్‌ పథకంపై కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలికసదుపాయాలు కల్పించకుండా..పథకాన్ని ఎలా విజయవంతం చేస్తారని నిలదీశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా... ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కమిషన్‌ ఏర్పాటులో కేంద్ర సహకారం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్‌, BJP సభ్యులు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేశారు.

కాంగ్రెస్‌ నిరసనపై మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. 2010 నుంచి ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ లేదని.. ఇప్పుడు వాకౌట్‌ చేసిన వాళ్లే ఆరోజు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. నకిలీ, నాసిరకం, కల్తీ విత్తనాల బెడద నివారణలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. అయితే నకిలీల వ్యవహారంలో.. గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు తీసుకువస్తామని... ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

అనంతరం కేసీఆర్ కిట్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసీఆర్ కిట్.. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ పేర్కొన్నారు. అయితే అధికారిక లెక్కలు గొప్పగా ఉన్నా.. వాస్తవ పరిస్థితి అలా లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి విమర్శించారు. ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలతో ఈ పథకాన్ని ఎలా సక్సెస్ చేస్తారని ప్రశ్నించారు. వరండాల్లో పడుకోబెట్టి ప్రసవాలు చేస్తున్నారన్నారు.

కేసీఆర్‌ కిట్‌ పథకంపై మాట్లాడిన సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య... పుట్టే పిల్లల లింగ భేదం లేకుండా నగదు పారితోషికం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కిట్ల పంపిణీలో రద్దీ పెరగడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయని ఆ సమస్య రాకుండా చూడాలన్నారు. కేసీఆర్ కిట్‌ పథకాన్ని విపక్షాలు విమర్శించడం తగదని.. వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాసుపత్రుల్లో 94 వేల ప్రసవాలు జరిగితే.. 92 వేల మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. పథకం అమల్లో అవకతవకలకు తావు లేకుండా.. ఆన్‌లైన్‌లో నమోదు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. సభలో కేసీఆర్ కిట్లపై లఘు చర్చ అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ మధుసూదనాచారి ప్రకటించారు. 

Don't Miss