సీపీఎం కార్యవర్గం సమావేశం

21:35 - February 14, 2018

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ కార్యదర్శి వర్గ సమావేశం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన ఎంబీ భవన్‌లో జరిగింది. నల్గొండలో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభల్లో ఎన్నికైన కార్యదర్శి వర్గ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌ లో జరిగే సీపీఎం జాతీయ మహాసభల ఏర్పాట్లతోపాటు, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ బలోపేతం, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించారు.

నోరు మెదపని ముఖ్యమంత్రి కేసీఆర్‌
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా నోరు మెదపని ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతల వైఖరిని సీపీఎం కార్యదర్శి వర్గం తప్పు పట్టింది. గురువారం జరిగే బీఎల్‌ఎఫ్‌ సమావేశంలో చర్చించి దీనిపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే సీపీఎం జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు 20 కమిటీలు ఏర్పాటు చేస్తూ కార్యదర్శి వర్గం నిర్ణయం తీసుకుంది. ఓ వైపు పార్టీ మహాసభల ఏర్పాట్లు చూస్తూనే మరో వైపు బీఎల్‌ఎఫ్‌ను బలోపేతంపై దృష్టి పెట్టింది. బీఎల్‌ఎఫ్‌లోఎవరైనా నేరుగా చేరొచ్చని, ఫ్రంట్‌లోని ఏదోఒక పార్టీలో చేరాలన్న నిబంధన ఏదీలేదని సీపీఎం తెలంగాణ కార్యరద్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. జిల్లాల్లో బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభలు నిర్వహించాలని సీపీఎం కార్యదర్శి వర్గం నిర్ణయించింది. ఈనెల 20న సంగారెడ్డి, 25న మహబూబ్‌నర్‌లో ఫ్రంట్‌ సదస్సులు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు బీఎల్‌ఎఫ్‌ ఒక్కటే ప్రత్యామ్నాయమన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. 

Don't Miss