నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ

09:31 - March 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌ ఇవాళ సాయంత్రం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బిల్లుల ఆమోదంపై కేబినెట్‌ చర్చించనుంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో చేపట్టాల్సిన చట్ట సవరణ, మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశముంది. 
కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం
నేడు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించే అవకాశముంది. ప్రధానంగా బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నందున.. ఈ సమావేశాల్లో చేయాల్సిన చట్టాలపై కేబినెట్‌ చర్చించనుంది. బడ్జెట్‌పై వివిధ తరగతుల నుంచి వస్తున్న స్పందనపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశముంది. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌లో చేపట్టాల్సిన సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది.  సబ్‌ప్లాన్‌కు నేరుగా నిధులు కేటాయించి, ఖర్చు చేసేలా విధానాలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు సబ్‌ప్లాన్‌కు పేరు కూడా మార్చి ప్రగతి పద్దు అని నామకరణం చేయనున్నారు. ఈ సబ్‌ప్లాన్‌ నిధులు క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా ఓ రిటైర్డ్‌ సీనియర్‌ అధికారిని నియమించనున్నారు. ఇందుకు మాజీ సీఎస్‌ ప్రదీప్‌చంద్ర పేరును  ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇవాళ జరిగే కేబినెట్‌లో దీనిపై ప్రధానంగా చర్చించనున్నారు.
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే బిల్లుపై చర్చ
ఈ సమావేశాల్లో ఆమోదించాల్సిన పలు బిల్లుపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే బిల్లును ఈ సమావేశాల్లోనే తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే క్షేత్రస్థాయి నివేదికలు కూడా తెప్పించుకుంది. ప్రతిపక్షాల నుంచి కూడా ఈ డిమాండ్‌ వినిపిస్తుండడంతో ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  గిరిజనులు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లుకు  కూడా ఈ సమావేశాల్లోనే  ప్రభుత్వం ఆమోదించాలని భావిస్తోంది. దీంతో ఈ బిల్లుపైనా కేబినెట్‌ చర్చించనుంది. వీటితోపాటు అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహం, సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర  డిమాండ్స్‌పైనా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది.

 

Don't Miss