'డబుల్ 'గృహప్రవేశాలు..

07:03 - December 23, 2016

మెదక్ : తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామంలో సందడి మొదలైంది. కాసేపట్లో కేసీఆర్ ప్రారంభించనున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల గృహ ప్రవేశానికి అంతా సిద్ధమైంది. ఏకకాలంలో సామూహిక గృహ ప్రవేశాలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సీఎం దత్తత గ్రామాల దశ తిరిగింది. ..
సీఎం దత్తత గ్రామాల దశ తిరిగింది. మొన్నటిదాకా పాత పెంకులతో..మట్టిగోడలతో.. ఇరుకుగా ఉన్న నివాసాలు..ఇప్పుడు పక్కా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లుగా మారాయి. పదీ ఇరవై కాదు.. ఏకంగా 580 ఇండ్లు ఫల పుష్పాల మొక్కలతో తన పల్లె వాతావరణం ఛాయలు కోల్పోని ఒక అద్భుతం.. ఆవిష్కారానికి సిద్ధమయ్యింది. కాసేపట్లో ఈ గృహాలన్నీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.

కాసేపట్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేసీఆర్
దత్తత గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం గృహ ప్రవేశాలకు సీఎం కేసీఆర్ కాసేపట్లో లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. 600 మంది బ్రాహ్మణులతో ప్రత్యేక పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించబోతున్నారు. ప్రతిఇంటికి రెండు పాడి గేదెలు, పది దేశీయ కోళ్లు అందజేస్తున్నారు. ఇంటింటికీ ఐదు ఫల పుష్ప మొక్కలు అందిస్తున్నారు. వైఫై సేవలు.. ఎల్‌ఈడీ విద్యుత్ కాంతులు వెల్లివిరియనున్నాయి.

ఉదయం 7గంటల 53 నిమిషాలకు ప్రారంభం
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం కేసీఆర్ ఉదయం 7గంటల 53 నిమిషాలకు ప్రారంభించనున్నారు. ఎర్రవల్లిలోని ఫంక్షన్ హాల్‌లో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ ఇప్పటికే ఎర్రవెల్లిలో ఉన్న తన ఫాంహౌస్‌ కు చేరుకున్నారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Don't Miss