ప్రైవేట్‌ విద్యాసంస్థలతో ప్రభుత్వ చర్చలు సఫలం

07:48 - August 10, 2018

హైదరాబాద్ : కేజీ టూ పీజీ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రైవేట్‌ యాజమాన్యాలు ప్రభుత్వం ముందుంచిన ప్రధానమైన నాలుగు డిమాండ్స్‌పైనా ఇరు పక్షాలు చర్చించాయి.  అయితే ఒక డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చినా... మిగతావాటిపై ప్రభుత్వం దాటవేసే ధోరణి అవలంభించిందంటూ ప్రైవేట్‌ యాజమాన్యాలు మండిపడుతున్నాయి. అయితే భేటీలో పాల్గొన్న మంత్రులు మాత్రం సానుకూలంగా చర్చలు జరిగాయని చెబుతున్నారు.
ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
తెలంగాణలోని ప్రైవేట్‌ విద్యాసంస్థలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. ప్రైవేట్‌ విద్యాసంస్థల డిమాండ్స్‌పై వారితో చర్చలు జరిపింది. ప్రైవేట్‌ యాజమాన్యాలు ప్రభుత్వం ముందు పలు డిమాండ్స్‌ను ఉంచింది. ఈ డిమాండ్స్‌పై చర్చించిన ప్రభుత్వం అందులో కొన్ని పరిష్కరిస్తామని హామీనిచ్చింది. మరికొన్ని డిమాండ్స్‌పై దాటవేత ధోరణి అవలంభించింది. గతేడాదికి సంబంధించిన 12 వందల కోట్ల ఫీరు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలపై స్పష్టమైన హామీ రాలేదని ప్రైవేట్‌ యాజమాన్యాలు అంటున్నాయి. ఈ సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు ఫీజురీఎంబర్స్‌మెంట్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు.
ప్రతి విద్యాంస్థకు ఫైర్‌సేఫ్టీ నిబంధనలు, ఎస్కేప్‌ రూట్‌ ఏర్పాటు 
ప్రతి విద్యాంస్థకు ఫైర్‌సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించాలని, ఎస్కేప్‌ రూట్‌ ఏర్పాటు చేయాలని ప్రైవేట్‌ విద్యాసంస్థల ప్రతినిధులు సూచించారు. అయితే దీనిపై అధ్యయనం చేయిస్తున్నట్ట కడియం చెప్పారు. జూనియర్‌, డిగ్రీ కాలేజీలకు సెపరేట్‌గా నిధులను విడుదల చేయాలని ప్రైవేట్‌ యాజమాన్యాలు కోరగా... అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని చర్చల్లో పాల్గొన్న ప్రైవేట్‌ విద్యాసంస్థల ప్రతినిధులు తెలిపారు. 
ప్రతి కళాశాల హాస్టల్‌కు అనుమతి తప్పనిసరి
ప్రతి కళాశాల హాస్టల్స్‌ కోసం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు డిగ్రీ ప్రవేశాలు దోస్త్‌ అడ్మిషన్స్‌కు మరో అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రాపర్టీ ట్యాక్ష్‌కు కొత్త స్లాబ్‌ను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం హామీనిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం మాటల వరకే మిగిలిపోతున్నాయని... అవి ఆచరణ రూపం దాల్చడం లేదని ప్రైవేట్‌ యాజమాన్యాలు అంటున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
 

 

Don't Miss