అధికార పార్టీకి సింగరేణి ఎన్నికల సవాల్

08:08 - September 14, 2017

కరీంనగర్/మంచిర్యాల/భూపాలపల్లి : గులాబీ పార్టీని ఉద్యమ సమయం నుంచి ఆదరించిన ఉత్తర తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంటోంది. వాయిదా పడుతూ వచ్చిన సింగరేణి కాలరీస్‌ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దీంతో రాజకీయ పార్టీల్లో బొగ్గు గనుల రాజకీయ వేడి రగులుతోంది. గులాబీ పార్టీని సింగరేణి ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలు అన్ని దాదాపు ఇప్పటికే ఏకమయ్యాయి. బొగ్గు గనుల ప్రాంతంలో ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటించాయి.కానీ అధికార పార్టీ నేతలు మాత్రం....అంతర్గత సమావేశాలతోనే ఎన్నికల ప్రణాళికలపై చర్చలు జరుపుతున్నారు.ఉద్యమ సమయంలో కార్మికుల పూర్తి మద్దతును కూడగట్టిన టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఆ స్థాయిలో మద్దతు లభించే అవకాశం లేదన్న అనుమానాలు పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. బొగ్గుగని కార్మిక సంఘంగా కార్మికుల్లో పట్టు సాధించినా.... అధికార పార్టీగా అవతరించిన తర్వాత కార్మికులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ పెద్దగా అమలైన దాఖలు లేవన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు.

వ్యూహాలపై గులాబీ నేతలు మల్లగుల్లాలు
కీలక హామీలు అమలుకు నోచుకోకపోవడంతో సింగరేణి కార్మికులను ఆకట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నాయి. వారసత్వ ఉద్యోగాల కల్పన విషయంలో అధికార పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న ఆందోళన టీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది. దీనికి తోడు ఉద్యమ సమయంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌, అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చినా.....ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోపోవడం వంటి అంశాలు గులాబి నేతలకు కొత్త సమస్యలు సృష్టించే అవకాశాలు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా....ఈ ఎన్నికల్లో తమకే విజయం దక్కుతుందన్న ధీమాను అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.ప్రతిపక్ష పార్టీలన్నీ మరో కార్మిక సంఘానికి మద్దతు తెలపడంతో ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఉత్కంఠ రేపుతున్నాయి.

Don't Miss