ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు..

20:50 - January 9, 2017

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్ధి వ్యతిరేఖ విధానాలపై ఎస్ఎఫ్ఐ మహాసభ 15 తీర్మానాలు చేసింది. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి.

93 మందితో నూతన రాష్ట్ర కమిటి ఏర్పాటు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ మహాసభ అభిప్రాయపడింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మూడు రోజుల పాటు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు ఘనంగా జరిగాయి. మొత్తం 93 మందితో నూతన రాష్ట్ర కమిటి ఏర్పడింది. అధ్యక్షుడిగా నాగేశ్వరరావు, కార్యదర్శిగా కోటా రమేష్‌లు ఎన్నికయ్యారు.

హామీలన్ని చెత్త బుట్టలో వేసింది : ఎస్ఎఫ్ఐ నూతన రాష్ట్ర కార్యదర్శికోటా రమేష్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముందుండి పోరాడిన విద్యార్ధుల కోసం ఎన్నో హామీలు గుప్పించిన తెలంగాణా రాష్ట్ర సర్కార్ ఇప్పుడా హామీలన్ని చెత్త బుట్టలో వేసిందని తెలంగాణా ఎస్‌ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన కోటా రమేష్ మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యార్ధి వ్యతిరేఖ విధానాలపై ఐక్యపోరుకు సిద్దమవుతున్నట్టు తెలిపారు.

కేజి టు పీజి ఏమైంది : ఎస్ఎఫ్ఐ
రాష్ట్ర ఏర్పాటు తరువాత కేజి టు పీజి అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఈ ఊసే ఎత్తడం లేదని వారు విమర్శించారు. మరోవైపు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా లక్షలాది మంది విద్యార్ధులను చదువులకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు యూనివర్శిటీలకు వేలాది ఎకరాలు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం గురుకుల కాలేజీలను మాత్రం అద్దె భవనాల్లో నడుపుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈనెల 17, 18, 19 తేదిల్లో అన్ని యూనివర్శిటీల్లో నిరసన కార్యక్రమాలు
మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిందూత్వ భావజాలాలను పెంచిపోషిస్తున్నాయని ఆరోపించారు. రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా ఈనెల 17, 18, 19 తేదిల్లో అన్ని యూనివర్శిటీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 

Don't Miss