'చక్కెర పోటుల' తెలంగాణ..

14:38 - May 17, 2018

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పెద్దలు చెప్పిన మాటలన్నీ అనుభవాలనుండి వచ్చినవే. అందుకని ఎంత ఆస్తిపాస్తులున్నా..పేరు ప్రతిష్టలున్నా..ఆరోగ్యం లేకుంటే అవిన్నీ వృథా. అందుకే ప్రజలకు కావాల్సింది ముందుగా ఆరోగ్యం. పాలకులు ప్రజలకు ఇవ్వాల్సింది సంక్షేమపథకాలు కాదు ఆరోగ్యం. ఇప్పుడది చాలా ప్రాముఖ్యమైనది. ఆరోగ్యం మంచిగా వుంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత పాలకులదే. అదే లేకుంటే రోగాల రాష్ట్రంగా, రోగాల దేశంగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. మనిషికి ఆరోగ్యం జన్మతహ వస్తుంది. అలాకాకుండా నేటి కాలుష్యకాసారంగా, ఒత్తిడిలు జీవితాలుగా మారిపోతున్న క్రమంలో ఎంతటి ఆరోగ్యవంతులైనా పలు దీర్ఘకాలిక రోగాల బారిన పడి నానా అవస్థలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పాలన, సంక్షేమ పథకాలే కాకుండా ఆరోగ్యవంతమైన సుపరిపాలన ప్రజలకు అందించాల్సిన బాద్యత ఆయా రాష్ట్రాల పాలకులదే.

రోగాల్లో కూడా తెలంగాణ ముందే...
పోషకాహార సంస్థ పలు ఆరోగ్యం అంశాలపై సర్వేలు నిర్వహించే విషయం తెలిసందే. ఈ క్రమంలోనే నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ మధుమేహ రోగులతో పాటు రక్తపోటు రోగులు కూడా పెరిగిపోతున్నారని పోషకాహార సంస్థ సర్వేలో వెల్లడయ్యింది. పాలన, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రోగాల విషయంలోనూ అదే స్థానంలో ఉందని జాతీయ పోషకాహార సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇప్పటి వరకు మధుమేహ రోగుల విషయంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ అధిక రక్తపోటు రోగుల విషయంలో ద్వితీయ స్థానంలో ఉందని తెలిపింది. రాజధాని హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా హైబీపీ రోగుల సంఖ్య అధికంగా ఉందని సర్వేలో బయటపడింది.

14కోట్ల మందికి బీపీ..
దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 14 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, మరో పదేళ్లలో వీరి సంఖ్య 21.4 కోట్లకు చేరుతుందని వైద్యులు చెబుతున్నారు. పురుషుల్లో 39 శాతం, మహిళల్లో 29 శాతం మంది ఈ రోగంతో బాధపడుతున్నారని తెలిపారు. రక్తపోటును అదుపులో ఉంచుకోకపోతే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, గుండె, కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Don't Miss