తడిసిపోతున్న తెలుగు స్టేట్స్...

21:15 - July 12, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్ళలోకి చేరింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగటంతో జనజీవనం స్తంభించింది. చందానగర్, లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో బయటకు రావడానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, కూసుమంచి, తిరుమలాయపాలెం, పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, భువనగిరి, శాలిగౌరారం, ఎల్కారంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈదురు గాలులకు చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిశాయి. తాండూరు, తెల్కపల్లి, తిమ్మాజిపేట, బిజినేపల్లిలో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి జల్లులు కురిశాయి. నార్నూర్ మండలంలో 9.64 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా కడెం నారాయణ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి 13,109 క్యూసెక్కుల వరద నీరు చేరింది. 3 గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రావులపాలెంలో 5.57 సెం.మీ, గడలలో 5.42 సెం.మీ, కపిలేశ్వరంలో 5.35 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించింది. తణుకు, అత్తిలి, ఇరగవరం, నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అత్తిలిలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీరోడ్‌ కాలువలోకి కుంగిపోయింది. కృష్ణా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో భారీ వర్షానికి రోడ్లన్ని నీటమునిగాయి. పలుచోట్ల లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇటు తెలంగాణ, అటు ఏపీలో ఖరీఫ్‌ నారుమళ్లకు తీవ్రమైన నష్టం ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంపునీరుతో నారుమళ్లు కుళ్లిపోతున్నాయి. నారుమడుల్లోంచి ముంపునీటిని బయటకు పంపేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నాటు వేసే పనులు ముందుకు సాగటం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు చాలా చోట్ల భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

Don't Miss