ఆగని చిన్నారుల 'అత్యాచార' ఘటనలు...

06:41 - May 13, 2018

హైదరాబాద్ : గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అత్యాచారం ఘటన మరువక ముందే.. మరోసారి దాచేపల్లిలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఓ ప్రజాప్రతినిధి అత్యాచారానికి ఒడిగట్టాడు. మరోవైపు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 7 ఏళ్ల చిన్నారిపై 65 ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో ట్యూషన్‌ కు వచ్చిన 12 ఏళ్ల బాలికపై ట్యూషన్ మాస్టర్‌ అత్యాచారం చేశాడు. బాలికలపై అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవక ముందే మరోసారి అలాంటి ఘోరమే వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికపై దాచేపల్లి మండల కోఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌ వలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 7 ఏళ్ల చిన్నారిపై 65 ఏళ్ల గురుస్వామి అనే వృద్దుడు అత్యాచార యత్నం చేశాడు. చిరుతిళ్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాప నానమ్మ చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గురుస్వామికి దేహశుద్ధి చేశారు. గురుస్వామిపై చిన్నారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌ మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లెనిన్‌ నగర్‌లో ట్యూషన్‌కు వచ్చిన 12 ఏళ్ల బాలికపై ట్యూషన్ మాస్టర్ అత్యాచారయత్నం చేశాడు. బాలిక అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు బాలికను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్‌ మండలం దుర్కి గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గ్రామానికి చెందిన అహ్మద్‌ హుసేన్‌ బాలికపై అత్యాచారం చేశాడు. చేప కూర తినిపిస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

దాచేపల్లితో పాటు నాయుడుపేటలో జరిగిన అత్యాచారాలపై పౌర సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం అత్యాచార ఘటనలపై సీరియస్‌గా చర్యలు తీసుకోకపోవడం వల్లే మరోసారి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నాయి. పాలక వర్గాల ఉదాసీన వైఖరి కారణంగానే పదేపదే మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఐద్వా నేతలు విమర్శిస్తున్నారు. ఘటనలకు పాల్పడిన వారు చట్టం నుండి తప్పించుకోకుండా చూడాలని అంటున్నారు. 

Don't Miss