తెలంగాణ..ఏపీలో పదో తరగతి పరీక్షలు...

07:12 - March 15, 2018

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. వసతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

రాష్ర్టవ్యాప్తంగా 6,17,484 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. 6,08,190మంది రెగ్యులర్ విద్యార్థులు, 9,294 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు రాసేవారిలో 6,15,650మంది ఎస్సెస్సీ, 1834 మంది ఓఎస్సెస్సీ విద్యార్థులు ఉన్నారు. ఇందుకోసం 2,834 పరీక్షా సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షాకేంద్రానికి 11మంది చొప్పున 3,11,74మంది ఇన్విజిలేటర్లను, 156 తనిఖీ బృందాలను నియామించారు. అన్ని పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్‌ విధించామన్నారు.

రాష్ర్ట వ్యాప్తంగా టెన్త్‌ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కలిపించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అనారోగ్య పరిస్థితులు తలెత్తితే వైద్య సేవలు అందించడానికి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం టెన్త్‌ పరీక్షలను చాలా పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. సందేహాల నివృత్తికోసం కంట్రోల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేసింది. 1800-599-4550కు ఫోన్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఎస్సెస్సీ 2018 మొబైల్‌ యాప్‌ను కూడా రూపొందించారు.

తెలంగాణలో...
తెలంగాణలోనూ నేటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 38 వేల 867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు ఎస్‌ఎస్‌సీ బోర్డు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గతేడాది తరహాలోనే ఐదు నిమిషాల ఆలస్యం నిబంధనను అమలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు గంట మోగింది. గురువారం నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలు వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల 103 పాఠశాలకు చెందిన 5 లక్షల 38వేల 867 మంది విద్యార్థలు పరీక్ష రాయనున్నారు. ఉదయం తొమ్మిదన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల 15 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 542 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్నీ సెంటర్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్భంది ఏర్పాట్లు చేశామని అధికారులు అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 38వేల 867 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా ఇందులో 2లక్షల 62వేల 479 మంది బాలికలు.. 2లక్షల 76వేల 388 మంది బాలురు ఉన్నారు. 5లక్షల 3వేల 117 మంది విద్యార్థులు రెగ్యులర్‌ పరీక్షలు రాయనుండగా, ప్రైవేటుగా రాసేందుకు 35వేల 750 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఒకేషనల్ విద్యార్ధులు 20వేల 838 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు 431పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని SSC అధికారులు తెలిపారు.
విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లరాదని SSC బోర్డు అధికారులు స్పష్టం చేశారు. టెన్త్ పరీక్షలు సజావుగా సాగేందుకు ఇప్పటికే బోర్డు అధికారులు వివిధ శాఖలతో చర్చించారు. విద్యుత్ శాఖతో పాటు రెవెన్యూ, పోలీసు డిపార్టమెంట్‌తో సంప్రదించామని అధికారులు తెలిపారు. ఆర్టీసీ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల దగ్గర 144సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.

పదో తరగతి పరీక్షల దృష్ట్యా ఈ సారి బందోబస్తును పెంచినట్లు అధికారులు చెప్పారు. పరీక్షల కేంద్రాల చుట్టు ఉన్న జీరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లను కూడా మూసివేయనున్నట్లు అధికారులు అన్నారు. ఈసారి కూడా ఐదు నిమిషాల ఆలస్యం నిబంధనను అమలు చేస్తున్నట్లు SSC అధికారులు ప్రకటించారు. 

Don't Miss