దుర్గామ్మభక్తులకు తప్పని భారం

07:41 - September 12, 2017

విజయవాడ : విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయ అధికారులు ఈసారి కూడా దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులపై భారం మోపేందుకు సిద్ధమయ్యారు. అమ్మవారిని దర్శించుకుని వివిధ పూజలు నిర్వహించేందుకు వచ్చే భక్తులపై టిక్కెట్ల భారం వేయడానికి రంగం సిద్ధమైంది. గతేడాది భారీగా పెంచిన సేవా టిక్కెట్ల ధరలను యధావిధిగా కొనసాగించాలని దుర్గగుడి అధికారులు, పాలకమండలి నిర్ణయించింది. దుర్గమాతకు నిత్యం నిర్వహించే కుంకుమ పూజలకు దసరా నవరాత్రి ఉత్సవాల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది. భక్తులు నవరాత్రుల్లో కుంకుమ పూజల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. సాధారణ రోజుల్లో కుంకుమ పూజకు వెయ్యి రూపాయలుగా టిక్కెట్‌ ధర ఉంటుంది. అయితే దసరా ఉత్సవాల సందర్భంగా ఈ టిక్కెట్‌ ధరను ఏకంగా మూడు వేల రూపాయలకు పెంచారు. అంతేకాదు.. సరస్వతీదేవి రూపంలో అమ్మవారు కనిపించే మూలానక్షత్రం రోజున ఇదే పూజకు ఏకంగా 5వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.

చండీయాగానికి 4వేల రూపాయలు
అమ్మవారికి నిత్యం నిర్వహించే చండీయాగానికి మామూలు రోజుల్లో వెయ్యి రూపాయలు టిక్కెట్‌ ధర ఉండగా.. దసరా ఉత్సవాల సమయంలో దానిని 4వేల రూపాయలకు పెంచారు. దసరా ఉత్సవాల్లో సేవా టిక్కెట్లను భారీగా పెంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలు భక్తులు దుర్గగుడివైపు చూడకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. దుర్గగుడిలో సేవా టిక్కెట్ల పెంపుపై ఎన్ని విమర్శలు వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దాదాపు 15 కోట్ల రూపాయలతో అమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నందున ఆదాయం కోసం టిక్కెట్ల ధరలను తగ్గించడం కుదరదని తేల్చి చెబుతున్నారు. సేవా టిక్కెట్ల ధరలను తగ్గించేందుకు అధికారులు ససేమిరా అనడంపై పాలకమండలి కూడా నిస్సహాయంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు దర్శనం టిక్కెట్ల రేట్లను తగ్గిస్తామని అధికారులు చెబుతున్నారు. సేవా టిక్కెట్ల ధరల పెంపుపై మాత్రం నోరు మెదపడం లేదు. వందల్లో ఉండే దర్శనం టిక్కెట్ల ధర కొద్దిగా తగ్గించి... వేలల్లో సేవాటిక్కెట్ల ధరలు పెంచడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా దసరా పండుగను నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులపై భారం పడేలా ఎందుకు సేవా టిక్కెట్ల ధరలను పెంచుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పెంచిన సేవా టిక్కెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Don't Miss