పెదగొట్టిపాడు దళిత కాలనీలో ఉద్రిక్తత..

15:36 - January 13, 2018

గుంటూరు : జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెదగొట్టిపాడు దళిత కాలనీ సందర్శనకు బయల్దేరిన సీపీఎం బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దళితులపై అగ్రకులస్తుల దాడుల నేపథ్యంలో సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధు ఆధ్వర్యంలో నేతలను కాలనీ సందర్శనకు బయల్దేరారు. వీరిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు మదుతో సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. అంతకు ముందు తెల్లవారుజాము నుంచే సీపీఎం నాయకుల ఇళ్లకు వెళ్లిమరీ పోలీసులు అరెస్టు చేశారు. గొట్టిపాడు మండల సీపీఎం కార్యదర్శి గంగాధరరావు, రాజధాని డివిజన్‌ సీపీఎం కార్యదర్శి ఎం.రవితోపాటు కాకాని పట్టణానికి చెందిన పలువురు సీపీఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.

జిల్లా గొట్టిపాడులో దళితులపై అగ్రకుల దాడులను సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఖండించారు. దళితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈనెల 23 లేదా 24 తేదీల్లో దళిత సంఘాలు- వామపక్షాలు చలో గొట్టిపాడు నిర్వహిస్తామన్నారు. బాధితులను పరామర్శించకుండా చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో నిర్బంధాలు కొనసాగిస్తోందని మధు మండిపడ్డారు.

జిల్లా గొట్టిపాడులో దళితులను పరామర్శించడానికి వెళుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును అడ్డుకోవడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం నియంతృంగా ప్రవర్తిస్తోందని దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 23 లేదా 24 తేదీల్లో వామపక్షాలతో కలసి చలో గొట్టిపాడు ను నిర్వహిస్తామని దళిత నేతలు స్పష్టం చేశారు. 

Don't Miss