సినిమా థియేటర్ల నిలువు దోపిడీ

12:33 - January 10, 2018

హైదరాబాద్ : సినిమా హాళ్ళలో దోపిడీ అనేది బహిరంగ రహస్యం.... దాన్ని నిర్ధారించడానికి ప్రత్యేకంగా త్రీమెన్‌ కమిటీని నియమించింది బల్దియా.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా... దోపిడి నిజమే అంటూ నివేదిక ఇచ్చింది ఆ కమిటీ... చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు.  థియేటర్లలో నిలువు దోపిడీపై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ..
ప్రశ్నించిన వారిపై థియేటర్ల యాజమాన్యాలు దాడులు 
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప్రజలకు వినోదం కోసం... 200లకు పైగా సినిమా థియేటర్లు, మ‌ల్టీ ప్లెక్సులు ఉన్నాయి. వీటిలో ప్రతి రోజూ కనీసం ల‌క్షమంది దాకా సినిమాలు చూస్తుంటారు. వినోదం కోసం వచ్చిన ప్రేక్షకులను థియేటర్‌ యాజమాన్యాలు నిలువుదోపిడీ చేస్తున్నాయి. టికెట్ రుసుంతో పాటు... తినుబండారాలు, కూల్ డ్రింక్స్, పార్కింగ్ పేరుతో  అడ్డంగా దోచుకుంటున్నాయి. నిబంధనల‌కు పాత‌రేసి..  అధిక ధ‌ర‌ల‌ను వ‌సూలు చేస్తున్నాయి. ఇందేంట‌ని ప్రశ్నించిన వారిపై దాడుల‌కు సైతం థియేటర్ల యాజమాన్యాలు వెనుకాడ‌టం లేదు.  
థియేటర్లలో అక్రమాలపై హెచ్చరించిన బల్దియా
సినిమా థియేటర్లలో అక్రమాలకు పాల్పడితే తాటతీస్తామని బల్దియా హెచ్చరించింది. టికెట్లు కానీ... తినుబండారాలు కానీ... అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవంది. బీ కేర్‌ ఫుల్‌... అంటూ బీరాలు పలికింది. సినిమా థియేటర్లో జరుగుతున్న దోపిడీపై త్రీమెన్‌ కమిటీని కూడా వేసింది. 
దోపిడీ నిజమే : త్రీమెన్‌ కమిటీ
థియేటర్లపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ  కొంత ఆలస్యంగానైనా నివేదికను అందించింది.  థియేటర్ల యాజమాన్యాలు  ప్రేక్షకులను దోచుకుంటున్నాయన్న  విషయాన్ని నొక్కి చెప్పింది. థియేటర్లలో చట్టవిరుద్ధ చర్యలను కళ్ళకు కట్టినట్లు వివరించింది త్రీమెన్‌ కమిటీ.
చట్టప్రకారం పార్కింగ్ ఫీజు వ‌సూలు చెయ్యకూడదు 
చట్టప్రకారం థియేటర్లలో పార్కింగ్ ఫీజు వ‌సూలు చెయ్యకూడదు. కానీ  వారు  థియేటర్లు మాత్రం ఈ నిబంధనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాహన పార్కింగ్‌ను ఆదాయ మార్గంగా మలచుకున్నాయి.  టూ వీలర్, ఫోర్ వీలర్, సైకిల్ ఇలా ఒక్కో వాహనానికి ఒక్కో లెక్కన పార్కింగ్‌ ఫీజు పేరుతో దోచుకుంటున్నాయి. ఆహార ప‌దార్థాల అమ్మకాల‌ విషయంలోనూ థియేటర్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. థియేటర్ల యాజమాన్యాల  దోపిడీని అరికట్టాలని  బ‌ల్దియాకు  త్రీమెన్‌ కమిటీ సూచించింది. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి చర్యలు తీసుకోవాలని  కోరింది. త్రీమెన్‌కమిటీ నివేదిక ఇచ్చి  ఏడాది కావస్తున్నా....  ఇప్పటికీ  బల్దియా ఏ థియేటర్‌పైనా చర్యలు తీసుకున్నది లేదు.
ఫీజు వసూలుకు సిద్ధపడిన జీహెచ్‌ఎంసీ
థియేటర్లనుంచి ఆస్తి ప‌న్నుతోపాటు..  ట్రేడ్ లై సెన్స్ ఫీజు కూడా వసూలు  చెయ్యాల‌ని  జీహెచ్ఎంసీ భావించింది. ఐతే దీనిపై  థియేటర్‌ యజమానులు కోర్టుకు వెళ్ళారు. దీంతో స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వచ్చింది. అధికారులు బాధ్యతగానూ... తెలివిగానూ వ్యవ‌హ‌రిస్తే బ‌ల్దియాకు ఆదాయంతో పాటు.... ప్రేక్షకుల జేబుకు ప‌డుతున్న చిల్లును కూడా అరిక‌ట్ట వచ్చని పలువురు సూచిస్తున్నారు. 

Don't Miss