నేడే రాష్ట్రపతి ఎన్నికలు

07:55 - July 17, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌, విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఎన్నిక కోసం దేశవ్యాప్తంగా 32 పోలింగ్‌ ఏర్పాటు చేశారు. పార్లమెంటు సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పార్లమెంటు హౌస్‌లో ఒకటి, అన్ని రాష్ట్రాల్లో ఒక్కో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్‌ను పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్‌ 33 మంది ప్రత్యేకాధికారులను నియమించింది. పోలింగ్‌ పూర్తైన తర్వాత బ్యాటెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూముల్లో ఉంచి, ఓట్ల లెక్కించేందుకు ఈనెల 20 ఢిల్లీకి తరలిస్తారు. రాష్ట్రపతి ఎన్నికకు ఈసారి ప్రత్యేక నిబంధనలను తీసుకొచ్చారు.

ఓటింగ్ కు ప్రత్యేక పెన్నులు
ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వెంట పెన్నులు తీసుకురావద్దని ఎన్నికల కమిషన్‌ సూచించింది. ఓటు వేసేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన మార్క్‌ను అందిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటింగ్‌ గదిలోకి వచ్చే ముందు వీరి వద్ద ఉన్న పెన్నులు పోలింగ్‌ సిబ్బంది తీసుకుంటారు. ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లే ముందు తిరిగి ఇస్తారు. బ్యాలెట్‌ పత్రాలపై గుర్తు పెట్టేందుకు మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ సంస్థ తయారు చేసిన ప్రత్యేక పెన్ను ఇస్తారు. మొదటిసారి పోలింగ్‌ కేంద్రాల వద్ద నిబంధనల పోస్టర్లు అంటించారు. ఎంపీలకు ఆకుపచ్చ రంగులో ఉండే బ్యాలెట్‌ పత్రాలు ఇస్తారు. ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్‌ పత్రాలు అందిస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్‌ అధికారి పని సులభమయ్యే విధంగా వేర్వేరు రంగుల్లో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు. ఎంపీలుగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

Don't Miss