టాలీవుడ్‌ ను వణుకుపుట్టిస్తోన్న డ్రగ్స్‌ రాకెట్‌

07:20 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ రాకెట్‌ టాలీవుడ్‌ వణుకు పుట్టిస్తోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న కొంతమంది టాలీవుడ్‌ స్టార్స్‌ నోటీసులపై స్పందించారు. డ్రగ్స్‌తో తమకేం సంబంధంలేదని స్పష్టం చేస్తున్నారు. అయితే కొందరి వల్లే సినీ పరిశ్రమపై చెడ్డపేరు వస్తుందని టాలీవుడ్ పెద్దలు చెప్తున్నారు. 
టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు 
టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్‌ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్స్‌కు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీచేయడంతో  సినీ పరిశ్రమలో ఒక్కసారిగా అలజడి రేగింది.
నాకు నోటీసులు అందాయి : సుబ్బరాజు
ఈ నోటీసులపై నటుడు సుబ్బరాజు స్పందించారు. తనకు నోటీసులు వచ్చిన వార్త నిజమేనని ఒప్పుకున్నారు. కానీ కెల్విన్ లిస్ట్‌లో తన పేరు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థంకావడంలేదన్నారు.
నాకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవం : నందు 
డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవమన్నారు నటుడు నందు. తనకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్  నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన పేరు లాగొద్దని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి విజ్ఞప్తి చేశారు. 
నాకు ఎలాంటి నోటీసులు అందలేదు : హీరో తనీష్‌ 
డ్రగ్స్‌ కేసులో సిట్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని యువ హీరో తనీష్‌ తెలిపారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. 
డ్రగ్స్‌ వ్యవహారంతో నాకు సంబంధం లేదు : ముమైత్ ఖాన్  
నోటీసులు అందుకున్న ఐటమ్ గర్ల్ ముమైత్‌ఖాన్‌ కూడా తనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదని తెలిపారు. డ్రగ్స్‌ మాఫియా సినీ పరిశ్రమకు విస్తరించడం దురదృష్టకరమని సినీయర్ నటులు అన్నారు.  
వారికి ఎలాంటి సాయం ఉండదు : శివాజీరాజా 
డ్రగ్స్ కేసులో తప్పు చేసిన స్టార్స్‌కి మా అసోసియేషన్ నుంచి ఎలాంటి సాయం ఉండబోదని మా అధ్యక్షులు శివాజీరాజా స్పష్టం చేశారు. వాళ్లకు చట్టం ఎలాంటి శిక్ష విధిస్తుందో..అసోసియేషన్ అంతే శిక్ష వేస్తుందన్నారు. మొత్తానికి టాలీవుడ్ స్టార్స్‌ డ్రగ్స్‌ మత్తులో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఈ డ్రగ్స్‌ మత్తులో మరెంతమంది టాలీవుడ్ స్టార్స్‌ చిత్తవుతారో చూడాలి. 

Don't Miss