గోరఖ్ పూర్ లో కొనసాగుతున్న మరణమృదంగం

21:55 - August 12, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బాబా రాఘవ్‌ దాస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల వరుస మరణాలు గుండెల్ని పిండేస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పిల్లల సంఖ్య 63కి చేరింది. ఆస్పత్రిలో ద్రవరూప ఆక్సిజన్‌ అందుబాటులో లేని కారణంగానే వీరంతా మృత్యువాత పడ్డారు. గడిచిన 48 గంటల్లోనే 33 మంది చిన్నారులు మృతిచెందారు. గురువారం ఒక్కరోజే 23 మంది చనిపోగా.. శుక్రవారం ఏడుగురు.. శనివారం ఉదయం మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నవజాత శిశువులూ ఉన్నారు.ఈ ఘటనపై యోగి సర్కార్‌ విచారణకు ఆదేశించింది. ఆక్సిజన్‌ సప్లయ్‌ గణనీయంగా తగ్గడం వల్లే పిల్లలు చనిపోయారన్న వార్తలను ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎమర్జెన్సీ సిలిండర్లను వినియోగించినట్లు పేర్కొంది. పిల్లల మరణాలకు వేరే కారణాలున్నాయని చెబుతోంది. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ప్రభుత్వమే బాధ్యత వహించాలి..
గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ బృందం బిఆర్‌డి ఆసుపత్రిని సందర్శించింది. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆరోగ్యశాఖ మంత్రి సంబంధిత అధికారులు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్‌ సత్యార్థి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా లేని కారణంగా 30 మంది చిన్నారులు బలయ్యారు. ఇది విషాదం కాదు. నరమేధం. అంటూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. 70ఏళ్ల స్వాత్రంత్యం అంటే మన చిన్నారులకు చెప్పే అర్థం ఇదేనా..? అని ప్రశ్నించారు. ఆసుపత్రికి ఆక్సిజన్‌ సిలిండర్లు సప్లయ్‌ చేస్తున్న ప్రయివేట్‌ సంస్థ పుష్పా సేల్స్‌ యజమాని ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత సంస్థ యజమాని మనీష్‌ భండారి ఇంటి నుంచి పారిపోయాడు. బిఆర్‌డి ఆసుపత్రి కొద్ది నెలలుగా ఈ సంస్థకు డబ్బులు చెల్లించకపోవడంతో 70 లక్షలు బకాయిలు పేరుకుపోయాయి. పుష్పా సేల్స్‌ పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆగస్టు 9 నుంచి ఆసుపత్రికి ఆక్సిజన్ల సరఫరా నిలిపివేసింది. ఆరోగ్యశాఖ అధికారులు, మెడికల్‌ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై యోగి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Don't Miss