కదం తొక్కిన గిరిజనులు

21:38 - June 23, 2017

కొత్తగూడెం : గిరిజన రైతులు ఆందోళన బాట పట్టారు. తమ భూములపై హక్కుల కోసం.. పోరాటానికి దిగారు. ప్రభుత్వ నిర్బంధంపై మండిపడ్డారు. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.   
గిరిజన రైతాంగం పోరుబాట 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన రైతాంగం.. పోరుబాట పట్టింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని..రైతులపై ప్రభుత్వ నిర్భందాన్ని ఆపాలని డిమాండ్‌ చేస్తూ.. గిరిజనులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణం మార్కెట్‌ యార్డ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు  భారీ ప్రదర్శన నిర్వహించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ జరిగింది. 
భారీ ర్యాలీ 
ర్యాలీగా కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్న గిరిజనులు అక్కడే సభను నిర్వహించుకున్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు, త్రిపుర ఎంపీ జితన్‌ చౌదరి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పోతినేని సుదర్శన్‌రావు, కాసాని ఐలయ్య పాల్గొన్నారు. 
పోడు సాగుదారులపై నిర్బంధం ప్రయోగిస్తే తిరుగుబాటు : జితన్ చౌదరి 
బీజేపీ, టీఆర్‌ఎస్‌లు గిరిజనుల దగ్గర నుంచి భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఎం నేతలు విమర్శించారు. ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే హక్కు ఎవరికి లేదని.. పోడు సాగుదారులపై నిర్బంధం ప్రయోగిస్తే తిరుగుబాటు తప్పదని..సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జితన్‌ చౌదరి అన్నారు. పోడు వ్యవసాయదారులు ప్రభుత్వ నిర్బంధ చర్యలకు భయపడవద్దంటే భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పిలుపునిచ్చారు.
పోడు వ్యవసాయదారులకు పట్టాలివ్వాలి : తమ్మినేని  
పోడు భూముల నుంచి గిరిజనుల వెళ్లగొట్టే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారని తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. గిరిజనుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజనులు తిరగబడితే పోలీసులు, ఫారెస్ట్‌ అధికారులు ఏమి చేయలేరని అన్నారు. పోడు వ్యవసాయదారులకు వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రదర్శనలో సుమారు పది వేల మందికి పైగా గిరిజనులు పాల్గొన్నారు. మరోవైపు, పోడు వ్యవసాయదారులపై అణచివేతపై..నిరసనగా రేపు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది.

 

Don't Miss