రిజర్వ్ లో ట్రిపుల్ తలాక్ తీర్పు

21:31 - May 18, 2017

ఢిల్లీ : వివాదస్పదంగా మారిన ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై సుప్రీంకోర్టులో మే 11న ప్రారంభమైన విచారణ ముగిసింది. ఆరు రోజుల విచారణ అనంతరం అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ట్రిపుల్‌ తలాక్‌పై మహిళల అభిప్రాయం తెలుసుకుని నిఖా నామాలో చేర్చేందుకు కాజీలందరికీ సూచిస్తామని ఆల్‌ ఇండియా పర్సనల్‌ లా బోర్టు కోర్టు సమక్షంలో ఒప్పుకుంది.

ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పాపంగా ఆమోదించాలని

ట్రిపుల్ తలాక్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పాపంగా ఆమోదించాలని షయారా బానో తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అమిత్ ఛద్దా కోరారు. ట్రిపుల్ తలాక్‌ విశ్వాసానికి, నమ్మకానికి సంబంధించిన విషయమన్న సీనియర్‌ న్యాయవాది కపిల్ సిబల్ వాదనను ఛద్దా తిప్పికొట్టారు. ట్రిపుల్‌ తలాక్‌ ఖురాన్‌లో ఎక్కడా లేదని..అది ఆమోదయోగ్యం కాదని పర్సనల్‌ లా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఛద్దా వాదనపై జోక్యం చేసుకున్న జస్టిస్‌ నారీమన్‌..

ఛద్దా వాదనపై జోక్యం చేసుకున్న జస్టిస్‌ నారీమన్‌..ట్రిపుల్‌ తలాక్‌ మతంలో భాగం కాదనేగా మీ ఉద్దేశమని ప్రశ్నించారు. ఛద్దా అవునని సమాధానం ఇవ్వడంతో ఈ కేసులో వాదనలు ముగిసినట్లేనని రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది.

ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆరు రోజుల పాటు విచారణ

ట్రిపుల్‌ తలాక్‌పై కేంద్రం, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, ఆల్‌ ఇండియా ముస్లిం వుమెన్‌ పర్సనల్‌ లా బోర్డు దాఖలు చేసిన పలు పిటీషన్‌లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సీజే.ఖెహర్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆరు రోజుల పాటు విచారణ జరిపింది. ఈ బెంచ్‌లో సిక్కు, క్రైస్తవ, పార్శీ, హిందు, ముస్లిం మతస్థులు సభ్యులుగా ఉన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగబద్ధమైన అంశమా...? మతపరమైన హక్కా..? అన్న కోణంలో విచారణ జరిపారు... నిఖా, హలాలా, బహుభార్యత్వంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Don't Miss