ఘనంగా అంబేద్కర్ జయంతోత్సవాలు..

19:55 - April 14, 2018

హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 127వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు పలువురు నేతలు నివాళులర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి దేశంలో పాలన సాగాల్సిన అవరం ఉందని నేతలు అన్నారు. బహునులకే రాజ్యాధికారం రావాలి.. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలు సాధించాలి.. జైభీమ్‌ అంటూ నినాదాలు మార్మోగాయి. తెలుగు రాష్ట్రాల్లో బి.ఆర్‌.అంబేద్కర్‌ 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

రాజధాని అమరావతిలో అంబేద్కర్‌ స్మృతివనం : చంద్రబాబు
బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగస్ఫూర్తిని అనుసరిస్తూ దేశంలో పాలన సాగాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్‌ గొప్పతనం భావితరాలకు తెలియాలనే రాజధాని అమరావతిలో అంబేద్కర్‌ స్మృతివనం నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

ఆశయాలను సాధించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి: కేటీఆర్
తెలంగాణ వ్యాప్తంగా అంబేద్కర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. అంబేద్కర్‌కు నిజమైన నివాళి అంటే ఆయన ఆశయాలను సాధించడమే అన్నారు. రాష్ట్రంలో దళితులు పారిశ్రామిక వేత్తలు గా ఎదగడానికి టి-ప్రైడ్‌ ప్రోగామ్‌ను అమలు చేస్తున్నామన్నారు.

బలహీన వర్గాలకు మోదీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోంది - బి.వి.రాఘవులు

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ లిబర్టీ వద్ద సీపీఎం నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బలహీన వర్గాలకు మోదీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోందన్నారు సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు రాఘువులు.

ఓయూలో 127 కేజీల భారీకేక్‌ కట్‌చేసిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
ఉస్మానియా వర్సిటీలో బాబాసాహెబ్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 127 కేజీల భారీ కేక్‌ను కట్‌చేసి విద్యార్థులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీమాస్‌ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్‌కు నివాళులర్పించారు. కులవ్యవస్థ నశించినపుడు దేశంలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తుందన్నారు.

ట్యాంక్‌బండ్‌పై 'రన్‌ ఫర్‌ క్యాస్ట్‌ ఫ్రీ ఇండియా' కార్యక్రమం
దళిత చాంబర్‌ ఆప్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో... 127వ అంబేద్కర్‌ జయంతి సందర్బంగా ట్యాంక్‌బండ్‌పై 'రన్‌ ఫర్‌ క్యాస్ట్‌ ఫ్రీ ఇండియా' కార్యక్రమం నిర్వహించారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జేపీ, టీఎస్పఈఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

టీడీపీ ప్రభుత్వం దళితులపై దాడులకు తెగబడుతోంది: సీపీఎం కార్యదర్శి మధు
అంబేద్కర్‌ జయంతి సందర్భంగా.. గుంటూరులో వామపక్షాలు, దళిత-ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలి జరిగింది. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి తదితరులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీలో దళితులపై జరుగుతున్న దాడులపై మధు ఆందోళన వ్యక్తం చేశారు.

అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం జనసేన కృషి: పవన్
హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో జరిగిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు.

దేశంలో దళితులపై దాడులు పెరిగిపోయాయి : రఘువీరా
గుంటూరులో జనసేన, కాంగ్రెస్‌, వైసీపీ, దళిత-ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచే దేశంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.

సామాజికన్యాయ సాధనకు అంబేద్కర్‌ చూపిన మార్గంలో సాగాలి : వామపక్షాలు
బాబాసాహెబ్‌ ఆశయాల సాధనలో ముందుకు సాగుతామని రాజకీయపార్టీలు ప్రకటించగా.. సామాజికన్యాయ సాధనకు అంబేద్కర్‌ చూపిన మార్గంలో సాగాలని వామపక్షాలు, దళితసంఘాలు పిలుపు నిచ్చాయి.

 

Don't Miss