అమెరికాను వణికిస్తోన్న బాంబ్‌ సైక్లోన్‌

18:00 - January 7, 2018

అమెరికా : బాంబ్‌ సైక్లోన్‌ అమెరికాను వణికిస్తోంది. ఈదురు గాలులు, భారీ వర్షాలు..  దట్టమైన మంచుతో... మనుగడే కష్టంగా మారింది.  ఉష్ణోగ్రతలు.. మైనస్‌ స్థాయికి పడిపోవడంతో.. పదుల సంఖ్యలో జనం మృతిచెందారు. మంచుతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇక్కట్లు నెలకొన్నాయి. 
అమెరికాపై విరుచుకుపడిన మరో తుపాన్‌
అమెరికాపై మరో తుఫాన్‌ విరుచుకుపడింది. ఆ దేశ తూర్పు తీరాన్ని తాకిన 'బాంబ్‌ సైక్లోన్‌' ధాటికి ఇప్పటి వరకు 12 మందికి పైగా చనిపోయారు. ఉత్తర, దక్షిణ కరోలినా, బోస్టన్, ఉత్తర ఫ్లోరిడా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది.
పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, భారీ వర్షాలు
తుఫాన్‌ ప్రభావంతో అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు.. మైనస్‌ స్థాయికి పడిపోవడంతో.... మంచు అధికంగా కురుస్తోంది. దీంతో రోడ్లన్ని మంచు దుప్పటితో కప్పుకున్నాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు విపరీతంగా మంచు కురుస్తుండటంతో..  స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పలు విమాన సర్వీసులను రద్దుచేశారు. న్యూయార్క్‌లోని రెండు ప్రధాన రన్‌వేలను మూసివేశారు. నయాగారా  జలపాతం దాదాపుగా గడ్డకట్టుకుపోయింది.
విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లపైనా తుఫాన్‌ ప్రభావం
తుఫాన్‌ ప్రభావం విద్యుత్‌, టెలీ కమ్యూనికేషన్లపై కూడా పడింది. వర్జీనియా, ఉత్తర కరోలినాలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. అలాగే న్యూయార్క్‌లో ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, 500 మంది సిబ్బందితో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఉత్తర ఫ్లోరిడా, సౌత్‌ ఈస్టర్న్‌ జార్జియాలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. లాంగ్‌ ఐలాండ్, సౌత్‌ ఈస్టర్న్‌ కనెక్టికట్‌లలో గంటకు 88.5 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. వర్జీనియా తీరం వెంట వాషింగ్టన్, న్యూపోర్ట్‌ న్యూస్‌ల మధ్య రైలు సేవలను నిలిపివేశారు. కాగా అత్యల్ప ఉష్ణోగ్రతలు, శీతల పవనాలు ఈ వారమంతా కొనసాగే అవకాశాలున్నట్టు అమెరికా జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. 

 

Don't Miss