యోగి ఆదిత్యానాథ్‌ సిఎం వరకు ఎలా ఎదిగారు?

21:41 - March 18, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 26 ఏళ్లకే ఎంపీ అయిన ఆదిత్యనాథ్‌ ఓ కరడుగట్టిన హిందుత్వవాది. ఇంతకీ యోగి ఆదిత్యానాథ్‌ సన్యాసి నుంచి సిఎం వరకు ఎలా ఎదిగారు? వాచ్‌ దిస్‌ స్టోరీ.
రేపు ప్రమాణస్వీకారం 
ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. యోగి అసలు పేరు అజయ్‌ సింగ్‌. జూన్‌ 5, 1972లో ఉత్తరాఖండ్‌లోని ఓ పల్లెటూర్లో జన్మించారు. గఢ్‌వాల్‌ యూనివర్సిటీ నుంచి బిఎస్‌సి పూర్తి చేశారు. అనంతరం ఆయన గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయ మహంత్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయనకు ముందు మహంత్‌ అవైద్యనాథ్‌ ఉత్తరాధికారిగా ఉన్నారు. ఆదిత్యనాథ్ హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా.
1998లో రాజకీయ సన్యాసం
1998లో మహంత్‌ అవైద్యనాథ్‌ రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఆ తర్వాత ఉత్తరాధికారిగా ఆదిత్యనాథ్‌ పేరును ప్రకటించారు. అదే సంవత్సరం రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 26 ఏళ్ల వయసులోనే ఎంపీ అయ్యారు. గోరఖ్‌పూర్‌ నుంచి వరుసగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 
ఆదిత్యనాథ్‌ కరడుగట్టిన హిందుత్వవాది
ఆదిత్యనాథ్‌ కరడుగట్టిన హిందుత్వవాది. ఎప్పుడూ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో నిలుస్తారు. 2007 గోరఖ్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించి ఆదిత్యనాథ్‌ను అరెస్ట్‌ చేశారు. యోగికి వ్యతిరేకంగా ఎన్నో కేసులున్నాయి. 2008లో ఆదిత్యనాథ్‌పై ఆజంగఢ్‌లో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

 

Don't Miss