యూపీ సీఎం అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ

07:54 - March 19, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరనే దానిపైపై ఉత్కంఠకు తెరపడింది. అందరి అంచనాలనా తారు మారు చేస్తూ యోగి ఆదిత్యనాథ్‌ను బిజెపి ఎంపిక చేసింది. ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేష్‌ శర్మలను ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నిక  
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీని సొంతం చేసుకున్న బిజెపి సిఎం అభ్యర్థిని ప్రకటించడానికి మాత్రం బాగా కసరత్తే చేసింది. వారం రోజుల పాటు తర్జన భర్జన పడ్డ కమలనాథులు ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెరదింపారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరిగిన బిజెపి శాసనసభాపక్ష సమావేశం తమ నేతగా 44 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్‌ను ఎన్నుకుంది. సమావేశం జరుగుతున్న వేదిక వద్ద ఆదిత్యనాథ్‌ మద్దతుదారులు భారీగా తరలివచ్చారు.యోగి యోగి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, మనోజ్‌ సిన్హా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్‌ప్రసాద్‌ మౌర్యతో పాటు యోగి ఆదిత్యనాథ్‌  పేర్లు  ప్రముఖంగా విన్పించాయి. చివరి నిముషంలో తాను సిఎం రేసులో లేనని మనోజ్‌ సిన్హా  ప్రకటించారు. సిఎం పదవి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకే వరిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. అనూహ్య మలుపుల మధ్య చివరకు యోగి ఆదిత్యనాథ్‌ను బిజెపి ఎంపికచేయడం గమనార్హం. 
సీఎం, మంత్రులు నేడు 2 గం.లకు ప్రమాణ స్వీకారం 
కొత్త సీఎం, మంత్రులు నేడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లఖ్‌నవూలోని కాన్సీరామ్‌ స్మృతి ఉప్‌వన్‌లో నిర్వహించే ఈ వేడుకకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, పార్టీ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది.

 

Don't Miss