ఎస్పీ, కాంగ్రెస్‌ల పొత్తు వెనుక ఇద్దరు మహిళలు..

12:57 - January 12, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. ఈ పొత్తు వెనక ఇద్దరు మహిళలు కీలక పాత్ర పోషించారు. ఒకరు యూపీ సిఎం అఖిలేష్‌ భార్య డింపుల్‌ కాగా...మరొకరు ప్రియాంక గాంధీ. పొత్తు ప్రకటన వెలువడడమే ఆలస్యం...ఈ మహిళా నేతలు కలిసి ప్రచారంలో దూసుకుపోనున్నారు.
ఎస్పీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయడం ఖరారు 
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయడం దాదాపు ఖారరైనట్లే. దీనికి సంబంధించి ప్రకటన వెలువడడం మాత్రమే మిగిలి ఉంది. ఈ వారంతంలో రెండు పార్టీల నేతలు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రచారంలో యూపీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌, రాహుల్‌ గాంధీ, ఆయన సోదని ప్రియాంక గాంధీ పాల్గోనున్నారు.
డింపుల్‌ యాదవ్‌, ప్రియాంకా గాంధీ కీలక పాత్ర 
ఎస్పీ కాంగ్రెస్‌ల మధ్య పొత్తు అవగాహన కుదర్చడంలో అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌, ప్రియాంకా గాంధీ కీలక పాత్ర పోషించారు. ఈ విషయంలో మంగళవారం డింపుల్‌, ప్రియాంక గాంధీ సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం ప్రియాంక- రాహుల్‌ ఇంటికి వెళ్లారు. రాహుల్‌ ఇంట్లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో సోనియాగాంధీ కూడా పాల్గొన్నారు. ఎస్పీతో పొత్తు గురించి డింపుల్‌తో జరిగిన చర్చలను ప్రియాంక రాహుల్‌, సోనియా, పార్టీ నేతలకు వివరించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌తో పొత్తుకు అఖిలేష్‌ ఆసక్తి
కాంగ్రెస్‌తో పొత్తుకు అఖిలేష్‌ యాదవ్‌ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రెండు పార్టీలు జత కడితే 3 వందల సీట్లు కైవసం చేసుకోవచ్చని అఖిలేష్‌ భావిస్తున్నారు. సమాజ్‌వాది పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా కాంగ్రెస్‌తో పొత్తు ప్రకటన ఆలస్యమవుతోంది. పార్టీపై, పార్టీ గుర్తుపై పూర్తి పట్టు సాధించాకే పొత్తుపై ప్రకటన చేయాలని అఖిలేష్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. పార్టీ గుర్తు కోసం ములాయం, అఖిలేష్‌ వర్గాలు ఈసీని సంప్రదించాయి. జనవరి 13న ఈసీ తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈసీ నిర్ణయం అఖిలేష్‌కు అనుకూలంగా వస్తే అదేరోజు పొత్తు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పొత్తుపై ఇరు పార్టీలు ఉత్సాహం
పొత్తుపై ఇరుపార్టీలు కూడా ఉత్సాహంగా ఉన్నాయి. ఓవైపు తండ్రితో వివాదం కొనసాగుతున్నా...అఖిలేష్‌ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. డిసెంబర్‌లో ప్రియాంకాగాంధీతో అఖిలేష్‌ జరిపిన చర్చల్లో ఇరు పార్టీల మధ్య పొత్తుపై బీజం పడింది. కాంగ్రెస్‌తో పొత్తుపై ములాయం, అఖిలేష్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీతో అఖిలేష్‌ సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం పొత్తుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

 

Don't Miss