ప్రధాని మోడీ, అమిత్ షా కు అగ్నిపరీక్ష

12:53 - January 10, 2017

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కు అగ్నిపరీక్షగా మారుతున్నాయి. బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడంతో పార్టీని గెలిపించే బాధ్యత వీరిద్దరి మీదే పడుతోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో 328 అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఆధిక్యత ప్రదర్శించిన బిజెపి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం  సాధించేందుకు శ్రమిస్తోంది.
బిజెపికి యూపీ అత్యంత కీలక రాష్ట్రం 
బిజెపికి ఉత్తరప్రదేశ్ అత్యంత కీలక రాష్ట్రం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నది ఉత్తర ప్రదేశ్ నుంచే కావడం విశేషం. 2014 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో ఆ పార్టీకి  ఏకంగా 71 లోక్ సభ స్థానాలు లభించాయి. యుపిలో ఇన్ని వచ్చి వుండకపోతే, బిజెపికి సొంతంగామెజార్టీ దక్కేది కాదు. 2019లో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ లో తన బలాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవాల్సి వుంటుంది. 
నోట్ల రద్దు తర్వాత తొలి ఎన్నికలు 
పెద్ద నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కూడా ఇవే. ఉత్తర ప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్  రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 403 అసెంబ్లీ స్థానాలున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఫలితం కోసమే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను నోట్ల రద్దుకు రిఫరెండంగా భావిస్తున్నవారూ లేకపోలేదు. 
2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 71 స్థానాలు 
2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఏకంగా 71 స్థానాలు గెలుచుకోవడానికి నరేంద్ర మోడీ క్రేజ్ తో పాటు అమిత్ షా రచించిన వ్యూహాలు కూడా కారణమయ్యాయి. ఇప్పుడు వీరిద్దరి ప్రతిష్టకు అదే ఉత్తరప్రదేశ్ లో అగ్నిపరీక్ష తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్ లో బిజెపి దెబ్బతింటే, ప్రధాని నరేంద్రమోడీ ఇమేజ్ గ్రాఫ్ మీద కూడా దాని ప్రభావం పడుతుంది. 
ఉత్తరప్రదేశ్ లో బిజెపికి బలమైన సీఎం అభ్యర్థి లేరు 
ఉత్తరప్రదేశ్ లో బిజెపికి బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు. ఒక వైపు ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మరో వైపు మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతి,  వీరిద్దరిలా సొంత కరిస్మా వున్న నాయకుడు ఉత్తరప్రదేశ్ బిజెపిలో లేరు. బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఉత్తరప్రదేశ్ కే చెందినవారే అయినా, రాష్ట్రం మొత్తాన్ని ఊపేయగల కరిస్మా  వున్న నాయకుడు కాదు. మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మేనకాగాంధీలదీ అదే పరిస్థితి. కాబట్టి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి పెట్టాల్సిన బాధ్యత పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భుజస్కందాల మీదనే వుంది. 
2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం 
2014 లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయాన్నే నమోదు చేసినా 1996 తర్వాత జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓట్ల శాతం తగ్గుతూ వచ్చింది. 1996లో బిజెపికి 32.51 శాతం ఓట్లు లభించగా, ఆ తర్వాత 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాని బలం 20.12 శాతానికి పడిపోయింది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో 17శాతానికి క్షీణించింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సాధించిన ఓట్లు 15శాతానికే పరిమితమయ్యాయి. అయితే 2014 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బిజెపి 43 శాతం ఓట్లు సాధించి, సునాయసంగా ఢిల్లీ సింహాసనం చేజిక్కించుకుంది. 
ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి బలం 41 మంది ఎమ్మెల్యేలు
ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి బలం 41 మంది ఎమ్మెల్యేలే అయినా, 2014 లోక్ సభ ఎన్నికల ప్రకారం 328 అసెంబ్లీ సెగ్మెంట్ లలో మెజార్టీ సాధించడం విశేషం. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 202 స్థానాలు గెలుచుకుంటే సరిపోతుంది. బిజెపి, ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరిగే ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలంటే, 30శాతం ఓట్లు సాధిస్తే చాలన్నది ఓ అంచనా. 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 94 స్థానాల్లో 50శాతానికి పైగా ఓట్లు సాధించింది. 253 స్థానాల్లో 40శాతం ఓట్లు సాధించింది. అయినా, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి పెను సవాలుగా మారుతున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో భారీగా ఓట్లు కొల్లగొట్టిన బిజెపి ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అదే ఊపు కొనసాగించలేకపోయింది. 2014 సెప్టెంబర్ లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు పెడితే, బిజెపి 3 చోట్ల మాత్రమే విజయం సాధించగలిగింది. 2016లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ చతికిలపడింది. ఈ అంశమే బిజెపిని ఎక్కువగా కలవరపెడుతోంది. అయితే,  ఎన్నికల ముంగిట్లో ములాయం సింగ్, అఖిలేష్ మధ్య తలెత్తిన విభేదాలు తమకు మేలు చేస్తాయన్న ఆశతో వుంది కమలదళం.  

 

Don't Miss