మరింత సమయం కావాలన్న ఉదయ సింహ...

13:25 - October 1, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐటీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ సింహ విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు సూచించారు. దీనితో సోమవారం ఆయన ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అధికారులు ఆయన్ను విచారించారు. 

కాసేపటి క్రితం విచారణ ముగిసింది. ఐటీ అధికారుల విచారణకు మరింత సమయం కోరడం జరిగిందని ఉదయ సింహ తెలిపారు. మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు సూచించడం జరిగిందని, ఈనెల 3వ తేదీన మరోసారి విచారణకు రావడం జరుగుతుందన్నారు. తమ బంధువు నివాసంపై ఐటీ అధికారుల పేరిట దాడులు జరిగాయని, కానీ తాము దాడి చేయలేదని ఐటీ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. తమ బంధువు ఇంటిపై దాడికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పన్ను ఎగవేత, అవినీతి ఆరోపణలతో గత బుధవారం రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు ఉదయ సింహా, ఎమ్మెల్సీ సెబాస్టియన్, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి ఇళ్ళల్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.

 

Don't Miss