‘పవన్' మరో ముందడుగు..

20:57 - February 12, 2018

హైదరాబాద్ : రాష్ట్ర విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా పోరు ఉధృతమవుతోంది. దీనికోసం జనసేన అధినేత తీసుకుంటున్న చొరవకు రాష్ట్రంలో రాజకీయ, మేధావి వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. జేఏసీ ఏర్పాటుకు చర్యలు వేగం అందుకున్నాయి. దీనిలో భాగంగా సీనియర్‌ రాజకీయనేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.

హైదరాబాద్‌లో భేటీ అయిన జయప్రకాశ్‌ నారాయణ, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సీపీఐ నేత రామకృష్ణ జేఏసీ ఏర్పాటుపై చర్చించారు. దాంతోపాటు కేంద్రంనుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల అంశాన్ని తేల్చేందుకు నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు తదిత అంశాలపై చర్చించారు. చర్చల సారాంశాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కు వివరించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు తెలిపారు.

మరోవైపు ఇప్పటికే వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని.. ఇదే ఊపుతో ప్రత్యేక హోదా పోరును మరింత ఉధృతం చేస్తామంటున్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. దీనికోసం ఈనెల 18న విజయవాడలో వివిధ రాజకీయపార్టీలు, పార్లమెంట్‌ సభ్యులు, మేధావులు, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే అంశాన్ని జేపీ, ఉండవల్లితో చర్చించామన్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ తలపెట్టిన జేఏసీ ఏర్పాటు హైదరాబాద్‌లో నేతల భేటీతో మరింత ఊపందుకుందని జనసేన ప్రతినిధులు అంటున్నారు. 

Don't Miss