నిరుద్యోగ భృతి హామీ ఏమైంది..?

08:04 - August 22, 2017

విజయవాడ : 2014 ఎన్నికల్లో ఎడాపెడా హామీలు గుప్పించారు. మూడేన్నరేళ్లు గడుస్తున్నా అవి నెరవేర్చిన దాఖలాలు లేవు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో.. నిరుద్యోగ భృతి హామీపై చంద్రబాబు స్పందించారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా భృతి చెల్లిస్తామని ప్రకటించారు. అయితే.. నిరుద్యోగ భృతిని ఎప్పటినుండి అమలు చేస్తారు... ? విధి విధానాలు ఏంటో ఖరారు చేయకపోవడంతో విద్యార్థి, యువజన సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
సర్కార్‌ తీరుపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి 
ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ తీరుపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014 ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని హామీలు గుప్పరించడమే కాకుండా.... యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లేకుంటే.. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అయితే... మూడేన్నరేళ్లు గడుస్తున్నా తమకు ఎలాంటి భృతి చెల్లించడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఇప్పటివరకు 60,776 మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుంటే.. ఒక్కరికి కూడా ప్రయోజనం చేకూరలేదని ప్రతిపక్షాలు, యువజన, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నమ్మి టీడీపీకి అధికారం కట్టబెడితే... చంద్రబాబు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటున్నారు. 
మళ్లీ టీడీపీ నిరుద్యోగ భృతి పల్లవి 
ఇక... నిరుద్యోగ భృతిపై ప్రతిపక్షాలు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం... 2019 ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ మళ్లీ నిరుద్యోగ భృతి పల్లవి అందుకుంది. అయితే... 18 నుంచి 35 ఏళ్లలోపు నిరుద్యోగులకు మాత్రమే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని సర్కార్‌ ప్రకటించింది. ఇంటర్‌లోపు విద్యార్థులకు 900 రూపాయలు, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తామని వెల్లడించింది. ఇందుకోసం బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే... నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం స్పష్టమైన విధానాలు ప్రకటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఎప్పటినుండి చెల్లిస్తారో చెప్పాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తానికి 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధ మవుతోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా... నిరుద్యోగ భృతి చెల్లించేందుకు సిద్ధ మవుతోంది. అయితే... ఇది ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో చూడాలి. 

 

Don't Miss