కేబినెట్‌ నుంచి కొందరికి ఉద్వాసన..?

19:47 - September 1, 2017

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్వస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి ఉదయం పునర్వస్థీకరణ జరుగుతుంది.  మంత్రివర్గం నుంచి కొందరికి ఉద్వాసన పలుకుతారు. కొత్త కొందరికి స్థానం కల్పిస్తారు. పునర్వస్థీకరణకు వీలుగా ఇప్పటికే  ఐదుగురు మంత్రులు రాజీనామా చేశారు. ఉమాభారతి, రాజీవ్‌ప్రతాప్‌ రూడీ, కల్‌రాజ్‌ మిశ్రా, ఫగ్గన్‌సింగ్‌ కులస్తే, సంజీవ్‌ బలియాన్‌ మంత్రిపదవుల నుంచి తప్పుకున్నారు. మరికొందరు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  పునర్వస్థీకరణలో ఏపీ నుంచి విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు లేదా నరసాపురం ఎంపీ  గంగరాజుకు చోటు దక్కే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఒకరికి  సహాయ మంత్రి పదవి ఇచ్చే చాన్స్‌ ఉంది. తెలంగాణ నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు శాఖ మారే అవకాశం ఉంది. సహాయ మంత్రులుగా ఉన్న పీయూష్‌గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌తోపాటు మరికొందరికి కేబినెట్‌ హోదా ఇచ్చే అవకాశం  ఉందని భావిస్తున్నారు. సురేశ్‌ ప్రభును రైల్వే శాఖ నుంచి తప్పించి, వేరే శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశంవుంది. రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రైల్వే బాధ్యతలు కట్టబెట్టొచ్చని ప్రచారం జరుగుతోంది. జేడీయూ, అన్నా డీఎంకేలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయకు బీజేపీ అధిష్టానం షాక్‌ ఇచ్చింది. మంత్రిపదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. దత్తాత్రయే పనితీరుపై బీజేపీ అధినాయకత్వం అసంతృప్తితో ఉంది.

 

Don't Miss