గడ్కరి 'పోలవరం' టూర్...

21:00 - July 11, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు సివిల్‌ నిర్మాణాలన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ చెప్పారు. ఏపీ ప్రభుత్వం అధికారులు మూడు రోజులు ఢిల్లీలో మకాంవేసి.. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని పోలవరంను సందర్శించిన గడ్కరీ సూచించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కాంట్రాక్టు సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు. జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.

పోలవరం సివిల్‌ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్ట్‌ సంస్థలు గడ్కరీ దృష్టికి తెచ్చాయి. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2019 ఫిబ్రవరిలోగానే సివిల్‌ నిర్మాణాలను పూర్తి చేయాలని గడ్కరీ ఆదేశించారు. ఇందుకు కాంట్రాక్టు సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి. ప్రాజెక్టు పనుల కోసం అడ్వాన్స్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా... ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినందున.. ఇది సాధ్యంకాదన్నారు. పెరిగిన నిర్మాణ వ్యయానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మూడు రోజులు ఢిల్లీలో మకాంవేసి... కేంద్ర అధికారులతో చర్చించి, అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని గడ్కరీ సూచించారు. ఇందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత పెరిగిన నిర్మాణ వ్యయంపై ఎనిమిది రోజుల్లో ఆర్థిక శాఖను వివేదిస్తానని గడ్కరీ చెప్పారు.

పోలవరం నిర్మాణ వ్యయం పెరిగినందున సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణ కార్యక్రమాల అమల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా పోలవరం ప్రాజెక్టునుపూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ చెప్పారు. గడ్కరీ ఆదేశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. కేంద్ర కోరిన అన్ని వివరాలను అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు స్థలంలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. బీజేపీ కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. 

Don't Miss