ఉన్నావ్ గ్యాంగ్ రేప్...యోగి స్పందన...

09:30 - April 14, 2018

ఉత్తర్ ప్రదేశ్ : ఉన్నావ్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో బిజెపి ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ను సిబిఐ అదుపులోకి తీసుకుంది. లక్నోలోని సిబిఐ కార్యాలయంలో సెంగార్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం ఆయనను సిబిఐ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. బాలికపై అత్యాచారం, ఆమె తండ్రి కస్టడీలో మరణించడం లాంటి మూడు కేసులు సెంగార్‌పై నమోదు చేశారు. ఎమ్మెల్యే సెంగార్‌న్‌ కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్‌ చేసింది. ఈ కేసుకు సంబంధించి సెంగార్‌ను అరెస్ట్‌ చేయాల్సిందేనని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. రేప్‌ కేసులో సిబిఐ విచారణ చేపట్టడాన్ని ఎమ్మెల్యే స్వాగతించారు. తాను మెడికల్‌ టెస్టుకు కూడా సిద్ధమేనని...దీంతో నిజాలు వెలుగు చూస్తాయని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఉన్నావ్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. అవినీతి, అత్యాచారాల విషయంలో తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్‌ నీతినే అవలంబిస్తుందని ఆయన పేర్కొన్నారు. అత్యాచారం కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ను సిబిఐ ఇప్పటికే అరెస్ట్‌ చేసిందని తెలిపారు. ఈ కేసు వెలుగులోకి రాగానే సిట్‌ వేసి దర్యాప్తు ప్రారంభించామని, అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసును సిబిఐకి అప్పగించామని యోగి తెలిపారు.

Don't Miss