స్వాతి, రాజేష్ 14 రోజుల రిమాండ్

22:06 - December 15, 2017

నాగర్ కర్నూలు : సుధకార్‌ రెడ్డి హత్య కేసులో నాగర్‌కర్నూలు పోలీసులు సీన్‌ ఆఫ్‌ ఎఫెన్స్‌ను రీక్రియేట్‌ చేశారు. కేసులో A1గా ఉన్న రాజేష్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఫతేపూర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సుధాకర్‌ రెడ్డిని ఎలా దహనం చేసిన విషయాన్ని రాజేష్‌ ద్వారా తెలుసుకున్నారు. అదే ప్రాంతంలో హత్యకు ఉపయోగించిన గడ్డపార, చున్నీ, ప్లేట్‌, పెట్రోల్‌ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నాగర్‌కర్నూలు తీసుకెళ్లారు. కోర్టు రాజేష్‌,స్వాతి ఇద్దరికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆ తర్వాత మీడియా ఎదుట పోలీసులు నిందితుడు రాజేష్‌ను ప్రవేశపెట్టారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, స్వాతి వేసిన ప్లాన్‌ను పోలీసులు వివరించారు. రెండేళ్ల క్రితం ఓ రోజు స్వాతి ఫిజియోథెరపి చేయించుకుంది. అక్కడ ఫిజియోథెరపిస్ట్‌ రాజేష్‌ పరిచయమయ్యాడు. మరోవైపు వ్యాపారంలో బిజీగా ఉండటంతో సుధాకర్‌రెడ్డి భార్యను నిర్లక్ష్యం చేశాడు. అదే సమయంలో రాజేష్‌, స్వాతిల పరిచయం ప్రేమగా మారింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇద్దరూ కలిసి వేరే ప్రాంతానికి వెళ్లి లెఫ్‌లో సెటిల్‌ కావాలని ప్లాన్‌ చేశారు. దీనికి అడ్డుగా ఉన్న సుధాకర్‌ రెడ్డిని కడతేర్చాలని నిర్ణయించుకున్నారు.

కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ మొత్తం స్వాతినే
అయితే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ మొత్తం స్వాతినే నడిపింది. 26వ తేదీ రాత్రి నైలాన్‌ తాడు, గడ్డపార కొనుగోలు చేసిన రాజేష్‌ స్వాతికి ఇంటికి తెచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత ఓ కాలేజ్‌ దగ్గర వేచివున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో రాజేష్‌కు ఫోన్ చేసిన స్వాతి.. భర్త సుధాకర్‌ రెడ్డి నిద్రపోయాడని ఇంటికి రమ్మని చెప్పింది. ఇంటికి రాగానే రాజేష్‌ లైట్లు ఆపి సుధాకర్‌ రెడ్డిని కమన్‌పట్టితో తలపై బాదాడు. దీంతో స్పృహలోకి వచ్చిన సుధాకర్‌రెడ్డి గట్టిగా అరిచాడు. తాగిన మైకంలో కిందపడి దెబ్బలు తగిలాయని అతడిని నమ్మించింది. పైగా ఈ మధ్య మద్యం సేవించడం ఎక్కువైందని ప్రేమ ఒలకబోసింది స్వాతి. ఓ వైపు భర్తతో మాట్లాడుతూనే మరోవైపు రాజేష్‌కు సైగ చేసి బయటికివెళ్లిపోమంది. అదే రాత్రి సుధాకర్‌రెడ్డి అల్లుడి సాయంతో భర్తను ఆస్పత్రికి పంపి చికిత్స చేయించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సుధాకర్‌రెడ్డి నిద్రలోకి జారుకున్నాడు.

అల్లుడు ఇంటినుంచి వెళ్లిపోగానే.....
తెల్లవారుజామున 5.30 గంటలకు సుధాకర్‌రెడ్డి అల్లుడు ఇంటినుంచి వెళ్లిపోగానే మళ్లీ రాజేష్‌ను ఇంటికి పిలిపించింది స్వాతి. సుధాకర్‌రెడ్డికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి అతని ముఖంపై దిండుతో అదిమిపట్టింది. రాజేష్‌ కూడా కమన్‌పట్టితో తలపై బలంగా బాదాడు. పారిపోవడానికి ప్రయత్నించిన భర్తపై రోకలిబండతో స్వాతి దాడి చేసింది. చున్నీతో మెడకు బిగించి దారుణంగా హత్య చేశారు. సుధాకర్‌రెడ్డి కారులోనే మృతదేహంతో పాటు హత్యకు ఉపయోగించిన వస్తువులను ఫతేపూర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేశారు. ఆ తర్వాత ప్రియుడినే భర్త స్థానంలోకి తెచ్చేందుకు సుధాకర్‌ రెడ్డిపై యాసిడ్‌ దాడి జరిగినట్లు స్వాతి హైడ్రామా నడిపింది. హైదరాబాద్‌ తీసుకెళ్లి చికిత్స కూడా చేయించింది. రాజేష్‌ వాలకం, అతడు ప్రవర్తించిన తీరుతో అనుమానించిన సుధాకర్‌రెడ్డి కుటుంబసభ్యులు పోలీసులకు ఉప్పందించడంతో డొంకంతా కదిలింది. నిందితులిద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో... మహబూబ్‌ నగర్ జిల్లా సబ్ జైలుకు తరలించారు. 

Don't Miss