దళితులపై అగ్రవర్ణల దాడులు

16:49 - September 6, 2017

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లాలో అగ్రవర్ణాల దాష్టీకం వెలుగు చూసింది. దళితులు గణేశ్‌ ఉత్సవాలను నిర్వహిస్తుంటే సహించలేక పోయారు. గ్రామంలో గణేశ్‌ నిమజ్జన ఊరేగింపును పెత్తందారులు అడ్డుకున్నారు. మద్యం సేవించిన అగ్రవర్ణాల యువకులు దళిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నోటికి వచ్చినట్టు దూషిస్తూ.. దళితులను కించపరిచారు.

మహిళలపై కూడా దాడి
ఆర్మూర్‌మండలం ఇసాపల్లిలో ఉన్న ఎస్సీ సామాజికవర్గం యువకులు గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 9 రోజులు పూజలు చేసి.. అంగరంగ వైభవంగా భగవంతునికి జేజేలు పలుకుతూ నిమజ్జనానికి బయలుదేరారు. ఇదంతా అగ్రవర్ణాలకు కంటగింపుగా మారింది. దళితులు ఇంత గొప్పగా పండుగ చేసుకోవడంపై కస్సుబుస్సుమన్నారు. తాగుబోతుల్ని ఉసిగొల్పారు. గ్రామంలోగణేశుని ఊరేగింపు సందర్భంగా గొడవకు దిగారు. దళితులు ఊరిలో పండగ చేసుకునేడేంది..అంటూ బండబూతులు తిడుతూ.. దళిత యువకుల్ని చితకబాదారు. అడ్డుకున్న మహిళలపై కూడా దాడి డి చేశారు. ఒంటిమీద చీరలు లాగి అసభ్యంగా ప్రవర్తించారని బాధితుుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాపోతున్న దళితులు
అగ్రవర్ణాలా అహంకారపూరిత దాడితో చెదిరిపోయిన దళితులు కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఖాకీలు ఎప్పటిమాదిరిగానే ఆ చూద్దాంలే అనే ధోరణిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అట్రాసిటీ కేసుపెట్టి దౌర్జన్యానికి దిగిన అగ్రవర్ణ దురహంకారుల్ని అరెస్టు చేయాలని కోరితే.. పోలీసుల పట్టించుకోవడం లేదని దళితులు వాపోతున్నారు. ఇప్పటికైనా దాడులకు తెగబడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. 

Don't Miss