తెలంగాణలో అంగరంగవైభవంగా వైకుంఠ ఏకాదశి

17:12 - January 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన యాదాద్రి, వేములవాడ, ధర్మపురి పుణ్యక్షేత్రాలతో పాటు పలు ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు తరలిరావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపించింది. 
కన్నుల పండువగా వైకుంఠ ఏకాదశి
పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం తెలంగాణలో కన్నుల పండువగా జరిగింది. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవాలయానికి భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. భారీగా తరలివంచిన భక్తులు వైకుంఠ  ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి దేవస్థానంతో పాటు కొండ కింద కొలువైన పాతగుట్ట దేవాలయంలో కూడా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. యాదాద్రి పునర్నిర్మాణం దృష్ట్యా కొండపైన వైకుంఠ ద్వార దర్శనానికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో స్వయంభూ అయిన పాతగుట్ట దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా... కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. దేవతా మూర్తులను పూలతో అలంకరించి ఆలయ ఉత్తర ద్వారం దగ్గర దర్శనం కల్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో.. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లా ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనంకోసం భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శన పూజను పండితులు పూర్తిచేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్‌ కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ బాల్క సుమన్‌, ప్రభుత్వ సలహాదారు వివేక్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 
మహబుబ్ నగర్ జిల్లా వైష్ణవ ఆలయాల్లో     
మహబుబ్ నగర్ జిల్లా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం 4 గంటల నుంచే భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. జిల్లాలోని పలు వైష్ణవ ఆలయాలతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు  భక్తజనం పోటెత్తారు.  
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో
అటు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వట్టెంలోని వేంకటేశ్వర ఆలయం, అచ్చంపేటలోని ఉమామహేశ్వరాలయం, కల్వకుర్తిలోని వేంకటేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడాయి. పలు వైష్ణవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వనపర్తిలో
వనపర్తిలో వెంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రమేశ్‌ గౌడ్‌ ప్రత్యేక పూజలు చేశారు. 
హైదరాబాద్‌ లో 
ఇక హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో పోటెత్తింది. స్వామి వారి దర్శనానికి తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించిన తర్వాత దర్శనానికి భక్తులను అనుమతించారు. పలువురు ప్రముఖులు  చిక్కడపల్లి బాలాజీని దర్శించుకుని పూజలు నిర్వహించారు.  
మేడ్చల్‌ జిల్లాలో  
అటు మేడ్చల్‌ జిల్లా మల్కాజ్‌గిరిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ ఎత్తున భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన క్యూలైను ఏర్పాటు చేశారు. మరోవైపు కీసర మండలం చీర్యాలలోని శ్రీలక్ష్మీనరసిహ్మస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. 

Don't Miss