మేడారానికి వీఐపీల తాకిడి..సామాన్యుల కష్టాలు..

06:41 - February 3, 2018

వరంగల్ : మేడారానికి వీఐపీల తాకిడి పెరిగింది. శుక్రవారం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమ్మక్కల, సారలమ్మలను దర్శించుకుని నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా.. జాతర ఏర్పాట్లపై వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. జాతరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని.. ఉత్సవాలు, పండగలు అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు.

మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడారంలోని అమ్మవార్లను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌ అమ్మవార్లకు బంగారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మేడారంలో శాశ్వత ఏర్పాట్ల కోసం రెండు వందల కోట్లను కేటాయిస్తామని కేసీఆర్‌ చెప్పారు. అమ్మవారి గద్దెల వద్ద సౌకర్యాల కోసం 200 నుంచి 300 ఎకరాలు సేకరిస్తామని తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని ప్రధానిని కోరుతానని చెప్పారు.

అయితే వీఐపీల రాకతో.. సాధారణ ప్రజలు గంటల కొద్ది లైన్‌లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో భక్తుల మధ్య తోపులాట సంభవించింది. దీంతో దర్శనం కోసం వచ్చిన వృద్ధులు, మహిళలు, పిల్లలు నానా అవస్థలు పడ్డారు. గంటల కొద్ది క్యూలైన్లలో నిలబడలేక... అధికారులపై మండిపడ్డారు.

అలాగే మంచిర్యాల జిల్లా.. మందమర్రి సింగరేణి ఏరియా.. పాలవాగు సమీపంలో నిర్వహించిన సమ్మక్కసారలమ్మ జాతరలో .. ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, మాజీ మంత్రి జి .వినోద్, రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్‌లు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని బెల్లం సమర్పించుకున్నారు.

Don't Miss