ద్వాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

06:57 - January 9, 2017

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ద్వాదశి వేడుకలకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు దైవ నామస్మరణతో మార్మోగుతున్నాయి. తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. ద్వాదశి సంధర్భంగా క్యూ కాంపెక్స్‌లు నిండిపోయాయి. భద్రాచలంలో ఏకాదశి పురస్కరించుకొని తెప్పొత్సవం కన్నుల పండువగా జరిగింది.

హిందువులకు అత్యంత ప్రవిత్రమైన రోజు....

ముక్కోటి ఏకాదశి హిందువులకు అత్యంత ప్రవిత్రమైన రోజు. దీంతో ఆదివారం ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయాల వద్ద భక్తుల తాకిడి నెలకొంది. ద్వాదశి పురస్కరించుకొని వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు.

తిరుమలలో శ్రీవారి ఆలయంతో పాటు ...

తిరుమలలో శ్రీవారి ఆలయంతో పాటు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం, యాదాద్రిలోని లక్ష్మి నరసింహాస్వామి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయం, భద్రాద్రిలోని రాముల వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ద్వాదశి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు ...

తిరుమలలో క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి. ద్వాదశిని పురస్కరించుకొని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నారాయణగిరిలో ఏర్పాటు చేసిన 16 తాత్కాలిక షెడ్లతో పాటు నాలుగు మాడవిధుల్లో భక్తులు నిండి పోయారు. తిరుమలకు 3 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడితో తిరుమల స్వామివారి నామ స్మరణతో మార్మోగిపోతోంది. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ సోమవారమూ కొనసాగుతోంది.

భద్రాద్రిలో రాముల వారి తెప్పొత్సవం...

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భద్రాద్రిలో రాముల వారి తెప్పొత్సవం కన్నుల పండువగా జరిగింది. సీతా సమేతుడై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఏకాదశి సందర్భంగా రాముల వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ద్వాదశి పురస్కరించుకొని భద్రాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీరామచంద్రుడి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సంధర్భంగా ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయాల్లో భద్రతను పెంచి పర్యవేక్షిస్తున్నారు.

Don't Miss