ఫ్లైఓవర్ ప్రమాదంలో 4గురు అధికారులు సస్పెండ్..

19:01 - May 16, 2018

ఉత్తరప్రదేశ్‌ : వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్‌ కూలిన ఘటనలో యోగి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫ్లయ్‌ ఓవర్‌ నిర్మిస్తున్న సేతు నిగమ్‌ ఏజెన్సీకి చెందిన నలుగురు అధికారులను సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా గాయపడ్డ ఏడుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బ్రిడ్జి కింద చిక్కుకున్న ముగ్గురిని సజీవంగా వెలికి తీశారు. ఫ్లయ్‌ ఓవర్‌ కూలిపోవడంతో 4 కార్లు, 5 ఆటోలు, ఓ సిటీ బస్‌తో పాటు పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఫ్లయ్‌ ఓవర్‌ కూలిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటి ఏర్పాటు చేసింది. 48 గంటల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానికులు చేపట్టిన ఆపరేషన్ ముగిసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి 2 లక్షల చొప్పున యూపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

Don't Miss