రాజ్యసభ లో తెలుగోడి వెలుగు

22:04 - August 11, 2017

ఢిల్లీ : 13వ భారత ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెంకయ్యనాయుడు చేత ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన పార్లమెంట్‌కు చేరుకుని రాజ్యసభ ఛైర్మన్‌లో ఆసీనులయ్యారు.స్వాతంత్ర్యానంతరం జన్మించినవారిలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి వెంకయ్యనాయుడు కావడం అరుదైన సందర్భమని ప్రధాని మోది అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, సభాకార్యకలాపాలు తెలిసిన వ్యక్తి ఉప రాష్ర్టపతి కావడం సంతోషంగా ఉందన్నారు.వెంకయ్యనాయుడు మంచి ఉపన్యాసకులని, ఏ మాధ్యమంలోనైనా అనర్గళంగా మాట్లాడగలరని ప్రశంసించారు. తెలుగులో వెంకయ్య ప్రసంగం సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా ఉంటుందని కితాబిచ్చారు. వెంకయ్యనాయుడు ప్రోద్బలంతోనే ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం విజయవంతమైందని మోది అన్నారు.

తెలుగువారికి గర్వకారణం
కాంగ్రెస్‌ పార్టీ తరపున వెంకయ్యనాయుడుకు గులాంనబీ ఆజాద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకయ్య సభను సరైన మార్గంలో నడిపిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వెంకయ్యతో పలు అంశాల్లో కలిసి పనిచేశామన్నారు. భావజాలం ఏదైనా ఉన్నత హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు న్యాయంగా వ్యవహరించాలని సీపీఎం రాజ్యసభ సభ్యుడు సీతారాం కోరారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభా చైర్మన్‌ హోదాలో వెంకయ్య నాయుడు ఉండటం తెలుగువారికి గర్వకారణమన్నారు. ఈసందర్భంగా గురజాడ అప్పారావు ప్రసిద్ధ సూక్తిని ప్రస్తావించారు. 'దేశమంటే మట్టికాదోయ్‌... దేశమంటే మనుషులోయ్‌' అనే సూక్తికి అనుగుణంగా వెంక్యయ వ్యవహరిస్తారని ఏచూరి ఆకాంక్షించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు తొలిసారిగా సభ్యులనుద్దేశించి మాట్లాడారు. 1998లో తాను రాజ్యసభ సభ్యుడినయ్యానని...కానీ సభా బాధ్యతలు స్వీకరిస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను అత్యున్నత పదవిని అధిష్టించడం ప్రజాస్వామ్యం గొప్పదనమని ఆయన తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌గా పార్టీలకతీతంగా సభను హుందాగా నడిపించేందుకు కృషి చేస్తానని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి ముందు వెంకయ్యనాయుడు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి శ్రద్ధాంజలి ఘటించారు. వెంకయ్య ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్రమంత్రులు, బిజెపి నేతలు అమిత్‌షా, అద్వాని, ఎన్డీయే ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తదితరులు హాజరయ్యారు.

Don't Miss