టీఆర్ఎస్ ఇంటిపోరుపై ఒంటేరు సంచలన వ్యాఖ్యలు..

19:46 - November 3, 2018

హైదరాబాద్ : గులాబీ గూటిలో పొడచూపుతున్న విబేధాలపై గత కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తునే వున్నాయి. కేసీఆర్ తరువాత హరీశ్ రావే ముఖ్యమంత్రి అంటు ఒక వర్గం కొంతకాలం క్రితం ప్రచారం చేయటం..దానిపై కేసీఆర్ మండిపడ్డారనే వార్తలు కూడా విన్నాం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో ఇంటిపోరు ఎక్కువైందని కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని...ఈ నేపథ్యంలో హరీష్ టీఆర్ఎస్ ను వీడనున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారని...త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని అన్నారు. కొంగరకలాన్ సభ తర్వాత 108 సభలు పెడతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ వంటేరు పైవ్యాఖ్యలు చేశారు.

అప్పటి నుండి కేసీఆర్ హరీశ్ రావ్ పై అసంతృప్తిగా వున్నట్లుగా పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. కాగా తన కుమారుడు కేటీఆర్ ను ఎలాగైనా సీఎంని చేయాలను దృఢ సంకల్పంతో వున్న కేసీఆర్ పలు వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాస్తు బాగాలేదంటు సెక్రటేరియట్ ను మార్చేంత వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ సెక్రటేరిట్ లో వుండి పాలన జరిపితే తన కుమారుడు సీఎం కాలేడనే నమ్మకంతో ఆయన పాలన ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ నుండే నడిపిస్తుంటారని అందుకు అంటుంటారు. సెక్రటేరియట్ కు రాని సీఎం అంటు విపక్షాలు విమర్శలు చేసినా కేసీఆర్ పట్టింకోకపోవటానికి కారణం కూడా అదేనంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో హరీశ్ రావ్ చురుగ్గానే పనిచేస్తున్నా..లోలోపల అసంతృప్తిగానే వున్నట్లుగా వార్తలు వస్తునే వున్నాయ్. ఈ క్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డి చేస్తున్న ఈ సంచలనాత్మక వార్తలు ఎంతవరకూ వాస్తవమో వేచి చూడాలి.
 

Don't Miss