గుండాలలో హృదయవిదారక ఘటన!..

18:40 - August 21, 2018

భద్రాద్రి కొత్తగూడెం : దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందంటు పాలకుల ఢాంబికాల మాటలకు కొదవే లేదు. గత పాలకుల చేతకానితనం వల్లనే తెలంగాణ ప్రాంతం భ్రష్టుపట్టిపోయిందంటు పాలకులు కొత్త పదాలతో తిట్లకు, శాపనార్థాలు కొనసాగుతునే వుంటాయి. కానీ ఇప్పటికీ అటవీ ప్రాంతాలలోని అమాయకులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేనే లేవనే సంగతి పాలకులు మరచిపోయి మాట్లాడుతుంటారు. వేసవి కాలం వచ్చిందంటు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల కొద్ది నడవాల్సిన దుస్థితి..వర్షాకాలం వచ్చిందంటే భారీ వర్షాలు కురుస్తున్నాయంటే చాలు అవడిబిడ్డలు అల్లాడిపోతుంటారు. ఎటువంటి రవాణా సౌకర్యాలు గానీ..తమ కష్టాల వంక గానీ చూడని..పట్టించుకోని పాలకుల మాటలు వారికి అలవాటైపోయాయి. కానీ కష్టం కాడెత్తుకు వచ్చి గుండెల్ని నలిపేస్తున్నాగానీ..కన్నీటిని కంటిలోనే అదిమిపెట్టి..ఆవేదనను పంటి బిగువులన ఒడిసిపట్టి తమ బాధలు తామే పడుతుంటారు అడవిబిడ్డలు..కానీ ఉద్దరిస్తాడనుకున్న కుమారుడు కళ్లముందే చనిపోతే..ఆ కట్లెను కాడెకు స్వయంగా కట్టుకుని మైళ్లకొద్ది నడుస్తున్న కన్నతండ్రి ఆవేదన..బాధ వర్ణనాతీతం..అటువంటి దుస్థితి..దుర్భర పరిస్థితికి నిలువుటద్దంలా కనిపిస్తోంది ఈ హృదయవిదారక ఘటన..

జిల్లాలోని గుండాలలో హృదయ విదాకర ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కుమారుడి కోసం ఏడవాలో..లేక భారీ వర్షాలకు తమకు దాపురించిన దుర్భర దుస్థితికి ఏడవాలో తెలీక కుమారుడి మృతికి హృదయ విదారకంగా విలపిస్తున్న వారిని చూస్తే ఎవరికైనా మనసు ద్రవించకమానదు. గుండాలలో పురుగుల మందు తాగి నరేశ్ అనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో దాదాపు పదులకొద్దీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటువంటి వాహనాలు కూడా తిరిగే పరిస్థితి గానీ..కమ్యూనికేషన్ సౌకర్యం గానీ లేకుండా పోయింది. ఈ క్రమంలో కుమారుడిని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు దాదాపు 20 కిలో మీటర్ల దూరం కుమారుడి మృతదేహాన్ని కాడెకు కట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో చనిపోయిన కుమారుడి కోసం గుండెలవిసేలా ఏడుస్తునే ప్రభుత్వ ఆసుపత్రికి కాడెకు కట్టి తీసుకెళ్లిన ఘటన గుండాలలో చోటుచేసుకుంది. 

Don't Miss