తెలంగాణపై బీజేపీకి పట్టు చిక్కేనా?..

09:08 - October 11, 2018

హైదరాబాద్ : ఇక కేంద్రంలో నడిచేవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్న తరుణంలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించింది. లోక్‌సభలో బీజేపీ బలం 275 సీట్లు. దేశంలో 29 రాష్ట్రాలకు గాను బీజేపీ, దాని మిత్ర పక్షాలు కలసి 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇది బీజేపీకి స్వర్ణ యుగమా? అనే ప్రశ్నను తలపించింది.  2014లో కేంద్రంలో కమలం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత సొంతంగా లేదా మిత్ర పక్షాలతో కలసి.. ఉత్తరాదిలో ఆయా రాష్ట్రాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాుట చేసిన బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వమే అక్కడ అధికారం చేపట్టింది. కాగా జమ్మూ కశ్మీర్ లో ముఫ్తీ పార్టీతో చెడిన సంబంధాల కారణంగా అక్కడ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుండి తప్పుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందనే కారణంతో ఏపీలో కూడా అధికారపార్టీ టీడీపీతో సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో కొన్ని రాష్ట్రాలలో సంకీర్ణంగా కొనసాగుతున్న బీజేపీ ఆయా పార్టీ లనుండి అభిప్రాయబేధాలతో విడిపోయవటంతో బీజేపీ ఉనికి కష్టంగానే వుంది. కర్ణాటకలోనూ బీజేపీ నాయకుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, అసెంబ్లీలో బలనిరూపణకు ముందే రాజీనామా చేశారు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం లభించింది. అలా బీజేపీ నుండి తప్పుకోవటంతో కొన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రశ్నార్థకంగా మారింది. 
చత్తీశ్‌గఢ్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2013 నుంచే అధికారంలో కొనసాగుతోంది. అంటే.. ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరాంలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోను ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా  కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 6న ప్రకటించింది. 

రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌లు మాత్రం.. భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకమైనవి. ఎందుకంటే..ఐదేళ్ల నుంచి అప్రహతీతంగా సాగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రభంజనం మొదలైనది ఈ రాష్ట్రాల నుంచినే. ఐదేళ్ల కిందట ఈ మూడు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణలో కూడా కాషాయ దళం పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో అపర చాణుక్యుడుగా రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. అటు ఏపీ సీఎంపైనా..ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా..తెలంగాణలో ఏర్పడిన మహాకూటమిపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. స్వతహాగా హిందూభావజాలం అధికంగా వున్న బీజేపీ ముస్లింలపై వివక్ష చూపుతోందనే విమర్శలు కూడా వున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా కరీంనగర్ సభలో మాట్లాడుతు..తెలంగాణలో  ముస్లిం పార్టీ అయిన ఎంఐఎంను ఎదుర్కోవటం కేసీఆర్ వల్ల చంద్రబాబు వల్ల కాదని ఒక్క బీజేపీకి మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పటం బీజేపీ ముస్లింల పట్ల వున్న తీరును తెలుపుతోంది. 

కాగా ఇటు తెలంగాణలో కేసీఆర్ హవాకు బ్రేకులు పడ్డాయి. ప్రజల నుండి కొంచెం వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోంది. దీనొక అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు టీఆర్ఎస్  ఓటుబ్యాంకును తమవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నాయి. మరోపక్క కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు నిధులు మంజూరు విషయంలో ఉదారత చూపుతోందని..అందుకే తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర కీలకమని ప్రజలకు తెలిపి ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణలో ఒక్క అవకాశం ఇవ్వమని బీజేపీ ఓటర్లను కోరుకుంటోంది. 

కాగా డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించినా..అధికార పార్టీతో సహా ఇప్పటి వరకూ ఏ పార్టీ కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించలేదు. దసరా తరువాతనే ప్రకటిస్తామని దాదాపుఅన్ని పార్టీలు చెబుతున్నాయి. కట్టుదిట్టంగా ఎవరికి వారు తమ మేనిఫెస్టోని సిద్ధం చేసుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఎవరు ముందుగా ప్రకటిస్తే వారి స్ర్కిప్ట్ ను మరోపార్టీ కాపీ కొట్టేస్తాయనే భయం కూడా కావచ్చు. 

కాగా జిల్లాలలో కంటే నగరంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన బీజేపీ ఇప్పటికే బీజేపీ మేనిఫెస్టోలో నగర వాసులకు పెద్ద పెద్ద తాయిలాలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.  కిరాయి ఇంటివారికి రూ.5వేలు, వాటర్ ట్యాక్స్ 1రూపాయి, నిరుద్యోగులకు భారీగా భృతివంటివి తమ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. మరి తెలంగాణ ప్రజలు మేనిఫెస్టో వాగ్ధానాలకు పడిపోతారో లేదో వేచి చూడాలి..కాగా సీట్లు పెద్దగా రాని దక్షిణాది రాష్ట్రాలలో ఎలాగైనా సరే పట్టు సాధించుకోవాలనే బీజేపీ పట్టుదల 2019 ఎన్నికల్లో ఏమాత్రం రాణిస్తుందో వేచి చూడాలి..

-ఎం.నాగమణి

Don't Miss