భారత్‌ మీడియా అత్యుత్సాహం చూపింది: మాల్యా

19:56 - April 18, 2017

హైదరాబాద్: బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసులో కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యా లండన్‌లో అరెస్ట్‌ అయ్యారు. అరెస్ట్‌ అయిన 3 గంటలకే ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తన అరెస్ట్‌పై భారత్‌ మీడియా అత్యుత్సాహం చూపిందని ట్విట్టర్‌లో మాల్యా అన్నారు.

ఫలించిన భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు...

భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసులో భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యాను లండన్‌ టైం ప్రకారం ఉదయం తొమ్మదిన్నరకు స్కాట్‌ల్యాండ్‌ యార్డ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెంటనే మాల్యాను వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ప్రవేశ పెట్టారు. మూడు గంటల తర్వాత ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

17 బ్యాంకుల్లో 9 వేల కోట్ల రుణాలకు మాల్యా ఎగనామం...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా 17 బ్యాంకుల్లో 9 వేల కోట్ల రుణాలకు మాల్యా ఎగనామం పెట్టారు. బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా మార్చి2, 2016లో దేశం విడిచి పారిపోయారు. విజయ్‌ మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు అత్యున్నత స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం మాల్యా వీసాను కూడా రద్దు చేసింది. మాల్యాను తమకు అప్పగించాలని ఫిబ్రవరిలో భారత విదేశాంగ శాఖ యూకే ప్రభుత్వాన్ని కోరింది.

మనీలాండరింగ్‌ కేసులో మాల్యాకు ఈడీ పలుమార్లు సమన్లు...

మనీలాండరింగ్‌ కేసులో విచారించేందుకు మాల్యాకు ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసినా హాజరు కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను భారత్‌కు రాలేనని... రుణాల చెల్లింపు విషయంలో బ్యాంకులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు కోర్టు మాల్యాపై ఆరు సార్లు అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌ 9 న వ్యక్తిగతంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు మాల్యాను ఆదేశించినా స్పందించలేదు. ఆర్థిక నేరాలకు సంబంధించి సిబిఐ కూడా విచారణ జరుపుతోంది.

మాల్యాకు వ్యతిరేకంగా బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును...

మాల్యాకు వ్యతిరేకంగా బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాల్యా తన పూర్తి ఆస్తుల వివరాలను వెల్లడించాలని పిటిషన్‌ వేసింది. అయితే దీనిపై కూడా మాల్యా స్పందించలేదు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆయనపై ఓపెన్‌ ఎండెడ్‌ నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. తన అరెస్ట్‌పై భారత్‌ మీడియా అతిగా ప్రవర్తించిందని విజయ్‌ మాల్యా ట్వీట్‌ చేశారు. భారత్‌కు అప్పగింతపై కోర్టులో వాదనలు మొదలయ్యాయని మాల్యా పేర్కొన్నారు. మొత్తానికి మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించడానికి మార్గం సుగమమైంది. త్వరలో సిబిఐ వర్గాలు లండన్‌కు వెళ్లనున్నాయి.

Don't Miss