విజయవాడ బెంజ్ సర్కిల్ రెండోదశ పనులు

08:25 - August 13, 2017

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో చేపట్టిన బెంజ్ సర్కిల్ ప్లై ఓవర్ పనులు వేగం పుంజుకోనున్నాయి. పనులు వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆగస్టు చివరి నాటికి రెండవ దశ పనులకు జాతీయ రహదారుల సంస్థ బిడ్డింగ్ పిలిచే ఏర్పాట్లు చేస్తోంది. సదరు కన్సల్టెన్సీ సంస్థ నుంచి డీపీఆర్ వచ్చిన తర్వాత బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. అయితే బిడ్డింగ్ ప్రపోజల్స్ ను అధికారులు మొదట రూపొందిస్తారు. ఆ తర్వాత వాటిని ఎన్‌హెచ్‌ అధికారులు ఢిల్లీలోని ఉన్నతాధికారులకు పంపిస్తారు. అక్కడే రెండో దశ పనుల టెండర్లు పిలిచి పాల్గొనే సంస్థలకు ఎన్‌హెచ్‌ అధికారులు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ను విడుదల చేస్తారు. బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ మొదటి దశ పనుల కోసం జ్యోతి కన్వెన్షన్‌ నుంచి నిర్మలా జంక్షన్‌ వరకు మాత్రమే టెండర్లు పిలిచారు. తర్వాత ప్లైఓవర్‌ను పొడిగించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు. దీంతో అధికారులు ప్రతిపాదనలు పంపగా వాటిని ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారులు తిరస్కరించారు. ఈ దశలో విజయవాడ - మచిలీపట్నం నాలుగు లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులతో కలిసి ఫ్లైఓవర్‌కు కూడా సంయుక్తంగా టెండర్లు పిలిచారు. ఈ టెండర్‌ను దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ దక్కించుకుంది.

డిజైన్‌ మార్పులు
ప్రస్తుతం సెంట్రల్ డివైడర్ స్థానంలో నాలుగు వరసల ఫ్లై ఓవర్ ను నిర్మించాల్సి ఉండగా దీని డిజైన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు మార్పులు చేశారు. ఫ్లైఓవర్‌ విజయవాడకు తలమానికంగా ఉండాలన్న సూచనలతో గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో మూడు లేన్లతో ఒక్కో ఫ్లై ఓవర్ ఉండేలా డిజైన్ రూపొందించారు. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక పార్ట్-2 ఫ్లై ఓవర్ పనులు వేగం పెరగాల్సిన అవసరం ఉంది. టీడీపీ నేతలు మాత్రం 2018 కల్లా అందుబాటులోకి తేస్తామని హామీ ఇచ్చారు. ఫ్లై ఓవర్ పనులు చూస్తే నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పైవంతెన ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ను పూర్తి చేయాలని బెజవాడ వాసులు కోరుతున్నారు.

 

Don't Miss