కృష్ణానది తీరాన నేటి నుంచి ఎయిర్‌ షో

09:28 - January 12, 2017

కృష్ణా : విజయవాడ ప్రజలను విమాన విన్యాసాలు అబ్బురపర్చనున్నాయి. మూడు రోజుల పాటు ఎయిర్‌క్రాప్ట్‌ల గగనతల విన్యాసాలు వీనులవిందు చేయనున్నాయి. నవ్యాంధ్ర రాజధాని పేరు మారు మోగేలా ఈ కార్యక్రమం జరగనుంది.
కృష్ణానది తీరాన 12, 13, 14 తేదీల్లో ఎయిర్‌ షో
కృష్ణా నది తీరాన నేటి నుంచి మూడు రోజుల పాటు ఎయిర్‌ షో జరగనుంది. దీనికోసం అధికారులు  చక చకా ఏర్పాట్లు చేస్తున్నారు. నదీ తీర ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పున్నమి స్నాన ఘాట్ వద్ద నుంచి భవానీఘాట్ వరకు మట్టితో చదును చేయిస్తున్నారు. ఘాట్ల వద్దకు వెళ్లేలా రహదారులు నిర్మాణాన్ని చేపట్టారు. దాదాపు రూ.80 లక్షల వ్యయంతో నగరపాలక సంస్థ అధికారులు పనులు నిర్వహిస్తున్నారు.
తిలకించేందుకు లక్షకు పైగా వస్తారని అంచనా
ఎయిర్‌ షోను తిలకించేందుకు లక్ష మందికిపైగా  నగర ప్రజలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి  సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి అశోక్ గజపతిరాజు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కృష్ణానదిపై బ్రిటన్‌కు చెందిన నాలుగు ఎయిర్ క్రాప్ట్‌ల విన్యాసాలు చేయనున్నాయి. దాదాపు 20 నిమిషాలపాటు ఆకాశంలో కనువిందు చేయనున్నాయి.  ఈరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 4.45 నిమిషాల వరకు, 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 11.15 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి 4.45 నిమిషాల వరకు, 14వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 11.15 నిమిషాల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 4.45 నిమిషాల వరకు ఎయిర్ షో  జరగనుంది.
అన్నీ ఏర్పాట్లు పూర్తి 
ఎయిర్‌షో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ఎయిర్‌షో ట్రయిల్‌ కూడా వేశారు. దీనిని చూసిన వీక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇలాంటి ఎయిర్‌షో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని..ముందుముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేదుకు అనువుగా నదీ తీర ప్రాంతాన్ని వేదికగా మలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  

 

Don't Miss