విజయవాడ రైల్వే స్టేషన్‌లో దోపిడీ పర్వం

09:25 - September 11, 2017

కృష్ణా : విజయవాడ రైల్వే స్టేషన్‌లో దోపిడీ పర్వం కొనసాగుతోంది. రైల్వేస్టేషన్‌లో తినుబండారాల ధరలు చూసి ప్రయాణికులు కంగుతింటున్నారు. ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లుకు విక్రయిస్తూ వ్యాపారులు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. . రైల్వే అధికారుల నిఘా లోపంతో వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.   
ఏడాదికి 175 కోట్లకు పైగా ఆదాయం
ఏడాదికి 175 కోట్లకు పైగా ఆదాయం.70 ప్యాసింజర్ రైళ్లు, 250 ఎక్స్‌ప్రెస్ రైళ్లు. బెజవాడ రైల్వేజంక్షన్ మీదుగా నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు. రైల్వేకు అత్యధిక ఆదాయమార్గంగా ఉన్న బెజవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు కనీసం ఆహారపదార్థాలు కూడా కొనలేని దుస్థితి నెలకొంది. స్టేషన్‌లో దోపిడీ పెచ్చుమీరిపోతోంది. రోజు రోజుకు ధరలు పెంచుతూ వ్యాపారులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మార్పీ ధరల కన్నా అధికంగా వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. రైల్వే జీఎం, డీఆర్ఎం తనిఖీ సమయాల్లో మాత్రమే ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తూ.. మిగతా సమయాల్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. 
బాదం మిల్క్ ధర రూ.25 కు బదులుగా రూ.35  
200 ఎంఎల్ బాదం మిల్క్ ధర 25 రూపాయలుగా ఉంటే.. దాన్ని 30 నుంచి 35కు విక్రయిస్తున్నారు. లీటర్ వాటర్ బాటిల్ 15 అయితే 20 నుంచి 25లకు అమ్ముతున్నారు. ఇక కూల్‌డ్రింక్స్‌పై అదనంగా 5 వడ్డిస్తున్నారు. 60 రూపాయల ఉన్న బిర్యానీని 70కి, 40 రూపాయలున్న కర్డ్ రైస్‌ని 50కి విక్రయిస్తున్నారు. తినుబండారాలు రుచి, సుచి లేకపోయినా..ఇష్టారాజ్యంగా దండుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని మండపడుతున్నారు.  
వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి : ప్రయాణికులు 
ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే తినుబండారాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదో తెలుసుకునేందుకు నిత్యం తనిఖీలు చేయాలని చెబుతున్నారు. 

 

Don't Miss