కొలిక్కిరాని విజయవాడ దుర్గమ్మ దర్శన టికెట్ ధరలు

08:19 - September 14, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్ల విషయం ఇంకా తేలలేదు. టికెట్ల ధరలను భక్తులపై వేయడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2015-16 సంవత్సరంలో ఇంద్రకీలాద్రిపై తొమ్మిది లక్షల మంది భక్తులు అంతరాలయం దర్శనం చేసుకున్నారు. అయితే 2016-17 సంవత్సరంలో మూడున్నర లక్షల మంది భక్తులు మాత్రమే అంతరాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయంలో అంతరాలయం టిక్కెట్ ధరను పెంచి.. భక్తులపై భారం వేయడం వల్లే దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. భక్తులకు ఇబ్బంది కలుగుతుండడంతో సెప్టెంబర్ 4న దేవస్థానంలో ఆలయ చైర్మన్ గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. దర్శనం టికెట్ ధరను 300ల నుంచి 150లకు తగ్గించాలని నిర్ణయించారు. అలాగే 100 రూపాయల టికెట్‌ ధరను 50కి తగ్గించాలని తీర్మానం చేశారు. దీనికి ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు కూడా పంపారు. ప్రభుత్వం ఆమోదం తరువాత అమ్మదర్శనం టికెట్ల ధరలు భక్తులకు అందుబాటులోకి వస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.

ఏటా కోటి మందికి పైగా
ఆంధప్రదేశ్‌లోనే రెండో అతిపెద్ద దేవాలయమైన ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి ఏటా కోటి మందికి పైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు. 2016 జులై వరకూ భక్తులు 9 లక్షల మందికిపైగా అమ్మవారిని అంతరాలయం దర్శనం చేసుకునేవారు. అంతరాలయ దర్శనం టికెట్ ధర 100 ఉండటంతో ఏటా దుర్గమ్మ గుడికి వచ్చే భక్తుల్లో 10 శాతం మంది మాత్రమే వీటిని కొనుగోలు చేసేవారు. వంద రూపాయల టిక్కెట్ల ద్వారా నెలకు 75 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఏటా 9 కోట్లకుపైగా ఆదాయం ఆలయానికి చేరేది.2016 ఆగష్టులో జరిగిన కృష్ణా పుష్కరాల నుంచి 2017 జులై వరకు 300 రూపాయల టిక్కెట్ల పెంపుతో ఆలయానికి 11.20 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ టిక్కెట్ల ద్వారా కేవలం 3లక్షల 73వేల మంది భక్తులు మాత్రమే అమ్మవారిని అంతరాలయ దర్శనం చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఐదున్నర లక్షల మంది భక్తులు తగ్గిపోయారు. కొంతమంది భక్తులు మాత్రమే ఉచిత దర్శనం క్యూలైన్లో నిలబడి దుర్గమ్మను దూరం నుండే దర్శించుకుంటున్నారు.

టికెట్‌ ధరపై 9 కోట్ల 33 లక్షల 47వేల 200 రూపాయలు
2014-15 సంవత్సరంలో వంద రూపాయల టికెట్‌ ధరపై 9 కోట్ల 33 లక్షల 47వేల 200 రూపాయల ఆదాయం వచ్చింది. అయితే ఈ సంవత్సరంలో 9 లక్షల 33 వేల భక్తులు అంతరాలయం దర్శించుకున్నారు. 2015-16 సంవత్సరంలో 100రూపాయల టికెట్‌ ధరపై 9కోట్ల 6లక్షల 32వేల 200 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరంలో 9 లక్షల 6వేల మంది భక్తులు అంతరాలయాన్ని దర్శించుకున్నారు. దర్శనం టికెట్ల ధర పెరగడం వల్ల భక్తుల సంఖ్య అమాంతం తగ్గిపోయింది. దసరా సమయం దగ్గరపడుతుండడంతో పాలకమండలి ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ ప్రతిపాదనలపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనొ పాత టికెట్ల ధరనే కొనసాగించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Don't Miss