సింగ్ ఈజ్ కింగ్..

06:38 - December 18, 2016

భారత స్టార్ బాక్సర్ విజేందర్ సంచలన విజయం సాధించారు. డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌గా విజేందర్ నిలిచాడు. ప్రత్యర్థి టాంజానియాకు చెందిన ప్రముఖ బాక్సర్ ఫ్రాన్సిస్ చెకాపై విజేందర్ ఘన విజయం సాధించాడు. విజేందర్‌ సింగ్‌ పంచ్‌కు ఎదురులేకుండా పోయింది. ప్రొఫెషనల్‌ కెరీర్‌లో అజేయ రికార్డును కొనసాగిస్తూ అతడు మరోసారి అదరగొట్టాడు. టాంజానియాకు చెందిన ప్రపంచ మాజీ ఛాంపియన్‌ ఫ్రాన్సిస్‌ చెకాకు చెక్‌ పెడుతూ విజేందర్‌ డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ నిలబెట్టుకున్నాడు.

ఏడో నాకౌట్ విజయం..
తొలి రౌండ్‌లోనే దూకుడు ప్రదర్శించిన విజేందర్‌.. చెకాపై 3 పిడిగుద్దులు కురిపించాడు. ఆ తర్వాతి రౌండ్‌లో బలంగా 7 పంచ్‌లు విసిరి ప్రత్యర్థిని డస్సిపోయేలా చేశాడు. ఇక మూడో రౌండ్‌లో 2 నిమిషాల్లోనే చెకాను టెక్నికల్‌ నాకౌట్‌ చేసి విజేతగా నిలిచాడు. పోరులో మొత్తం 10 రౌండ్లు ఉండగా.. చెకాను మూడో రౌండ్లోనే నాకౌట్‌ చేశాడు. ఇది వరసగా విజేందర్‌కు ఏడో నాకౌట్ విజయం. శనివారం జరిగిన పోరులో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విజేందర్‌.. బలమైన ప్రత్యర్థిగా భావించిన చెకాను తన పంచ్‌లతో బెంబేలెత్తించాడు. ప్రత్యర్థి మాటల్ని నమ్ముకుంటే తాను బలమైన తన పంచ్‌ల్నే నమ్ముకున్నాని మ్యాచ్ అనంతరం విజేందర్ తెలిపాడు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Don't Miss