చంపే హక్కు ఎవరిచ్చారు ?

08:52 - May 24, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలోని వదంతులు.. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఊరి శివార్లలోకి వచ్చే వారిని ఎవరూ... ఏంటి అని కనీసం విచారించకుండానే కర్రలతో చితకబాదేస్తున్నారు. తెలంగాణలో... గడచిన 24 గంటల వ్యవధిలోనే ఇద్దరిని ఇలాగే కొట్టి చంపేశారు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలన్నీ వదంతులే అని పోలీసులు ఎంతగా చెబుతున్నా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం జియాపల్లి వాసులు.. మంగళవారం రాత్రి ఇలాగే ఓ వ్యక్తిపై దాడి చేసి హతమార్చారు. సమీపంలోని కొర్రెముళ్ల గ్రామానికి చెందిన బాలకృష్ణ.. జియాపల్లిలోని బంధువు రామస్వామి ఇంటికి వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తున్న క్రమంలో కొందరు యువకులు అతడిపై కర్రలతో దాడి చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బాలకృష్ణ మార్గమధ్యలో మరణించాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన కొర్రెముళ్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు గ్రామంలో భారీ పికెట్‌ను ఏర్పాటు చేశారు.

అటు నిజామాబాద్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. భీమ్‌గల్‌ మండలం చెంగల్‌లో బావ, బావమరిదులిద్దరినీ.. స్థానికులు చావబాదారు. దాడిలో గాయపడ్డ మాల్యావత్‌ దేవ్యా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి బావ దేవాగత్‌ లాలూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మామిడికాయల కోసం వచ్చిన బావాబామ్మర్దులిద్దరినీ కిడ్నాప్‌ ముఠా అని భావించి గ్రామస్థులు చితకబాదారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. నందిగామ, మచిలీపట్నం, తదితర ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగినా... హిందీలో మాట్లాడినా.. పట్టుకుని చితక్కొడుతున్నారు. ఈడపల్లిలో పిల్లలను ఎత్తుకు పోయేవాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని చితకబాదారు. పోలీసు వచ్చిన.. బాధితుడిని చిలకలపూడి ఆసుపత్రికి తరలించారు. సోషల్‌మీడియా వదంతులను నమ్మవద్దంటూ పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. వీటిని వ్యాపింప చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరిస్తున్నారు.

బీహార్‌ ముఠా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తోందని.. పిల్లలు, వృద్ధులను కిడ్నాప్‌ చేసి వారి గుండె, మెదళ్లను తీసుకుని తినేస్తున్నారంటూ.. సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో.. ఆత్మరక్షణ కోసమంటూ.. స్థానికులు సొంతంగానే.. విడతలవారీగా గ్రామంలో పహారా కాస్తున్నారు. ఏ మాత్రం అనుమానం కలిగినా వారిని వదిలిపెట్టడం లేదు. చెట్లకు, విద్యుత్ స్తంభాలకు కట్టేసి మరీ కొడుతున్నారు. ఆ తర్వాత ఎప్పుడో పోలీసులకు సమాచారం అందిస్తున్నారు.

మొన్నటివరకూ.. హిందీ మాట్లాడుతూ కనిపించిన అపరిచితులపై అనుమానం రాగానే గ్రామస్థులు దాడి చేసేవారు. కానీ ఇప్పుడు.. తెలుగు మాట్లాడుతున్నా.. తమది పక్క గ్రామమేనని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. రాత్రిపూట గ్రామశివార్లలో కనిపిస్తే చాలు.. ఎవరో ఏంటో అని ఆరా కూడా తీయకుండా కడతేర్చే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో అత్యవసరమైన పని ఉన్నా.. పక్క గ్రామానికి వెళ్లేందుకూ.. పల్లెప్రజలు భయపడిపోతున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియా పుణ్యాన.. గ్రామస్థులు దాడులు చేస్తూ.. అమాయకులను హతమారుస్తూ.. అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. గ్రామస్థుల్లో భయం పోగొట్టేందుకు.. వారిలో చైతన్యం నింపేందుకు.. పోలీసు శాఖ.. పల్లెనిద్ర తరహా కార్యక్రమాన్ని రూపొందించుకుని.. అమలు చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

Don't Miss