నిమజ్జనం రూట్..బై..బై గణేషా..

06:35 - September 5, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జనాలు తుది దశకు చేరుకున్నాయి. నేడు కీలక ఘట్టమైన మహా శోభాయాత్ర ఉండటంతో పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్‌బండ్‌లో భారీగా విగ్రహాలను నిమజ్జనం చేయనుండటంతో ప్రధాన ఊరేగింపు మార్గాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మంగళవారం గణేశ్‌ నిమజ్జనంకు భాగ్యనగరం ముస్తాబైంది. వేడుకను సజావుగా నిర్వహించేందుకు.. పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. శోభయాత్రకు అడ్డంకులు లేకుండా..ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గాలను పోలీసులు నిర్ణయించారు. మొదటగా బాలాపూర్‌ నుంచి గణపతి ఊరేగింపు ఉదయం 6కు ప్రారంభమవుతుంది. అలియాబాద్‌-నాగుల్‌చింత-చార్మినార్‌-అఫ్జల్‌గంజ్‌- ఎం.జె.మార్కెట్‌-అబిడ్స్‌-బషీర్‌బాగ్‌-లిబర్టీ మీదుగా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు కొనసాగుతుంది. అలాగే సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే ఊరేగింపులు ఆర్‌పీరోడ్‌- ఎంజీరోడ్‌- కర్బలా మైదానం- కవాడిగూడ- ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్డు- ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు- నారాయణగూడ క్రాస్‌రోడ్డు- హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ మీదుగా లిబర్టీ వద్ద కలుస్తాయి. అలాగే ఉప్పల్‌ వైపు నుంచి వచ్చే ఊరేగింపులు - రామంతాపూర్‌- అంబర్‌పేట- ఓయూ ఎన్‌సీసీ - దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆసుపత్రి మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు వచ్చి కలుస్తాయి. అలాగే అబిడ్స్‌ మీదుగా వచ్చేవి ఎంజే మార్కెట్‌తో పాటు సచివాలయం- తెలుగుతల్లి విగ్రహం వద్ద కలుస్తాయి.

గణేష్‌ విగ్రహాలను తరలించే వాహనాలు మినహా మిగిలినవి ప్రధాన వూరేగింపు సాగే మార్గాల్లో కాకుండా ఇతర చోట్లకు మళ్లిస్తారు. ప్రధాన ఊరేగింపు మార్గం మొత్తం బారికేడ్లతో ఉండటం వల్ల... సాధారణ ప్రయాణికులు ట్రాఫిక్‌ మళ్లింపులను తప్పించుకునేందుకు బేగంపేట, రింగ్‌రోడ్డు మార్గంలో వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు వచ్చే వాహనదారులకు పలు చోట్ల పార్కింగ్‌ ప్రాంతాలను ఏర్పాటుచేశారు. ఖైరతాబాద్‌ కూడలి వద్ద ఉన్న ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఆనంద్‌నగర్‌ కాలనీలోని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం, గోసేవా సదన్‌, కట్టమైసమ్మ గుడి, నిజాం కళాశాల, ఖైరతాబాద్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, బుద్ధభవన్‌ వెనుకభాగం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ స్టేడియం, పబ్లిక్‌ గార్డెన్స్‌ స్థలాల్లొ పార్కింగ్‌కు కేటాయించారు.

ఎన్‌టీఆర్‌ మార్గంలో నిమజ్జనం తర్వాత ఖాళీ ట్రక్కులు, లారీలు నెక్లెస్‌ రోడ్డు మీదుగా ఖైరతాబాద్‌ వంతెన, పీవీ విగ్రహం, కేసీపీ మీదుగా వెళ్లిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ట్యాంక్‌బండ్‌ మార్గంలో నిమజ్జనం తర్వాత ఖాళీ వాహనాలు చిల్డ్రన్స్‌ పార్కు, డీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ, ఇందిరాపార్కు మీదుగా విద్యానగర్‌ మార్గంలో వెళ్లే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తినపుడు..అలానే వాహనదారుల సందేహాల నివృత్తికి ట్రాఫిక్‌ అధికారులు 040-27852482, 94905 98985, 9010203626 హెల్ప్‌లైన్‌ నంబర్లను కేటాయించారు.

నిమజ్జనం సందర్భంగా సిటీ బస్సుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. హుస్సేన్‌సాగర్‌కు దారితీసే.. మాసబ్‌ట్యాంక్‌, ఖైరతాబాద్‌, సీటీవో ప్లాజా, క్లాక్‌టవర్‌, చిలకలగూడ క్రాస్‌రోడ్‌, రామంతాపూర్‌ టీవీ స్టేషన్‌, గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్‌, మిధాని దగ్గరలోని ఐ.ఎస్‌.సదన్‌, వైఎంసీఏ నారాయణగూడ, జామై ఉస్మానియా వంతెన మార్గాల్లో ఆర్టీసీ బస్సులను అనుమతించరు.

రాజీవ్‌గాంధీ రహదారి, ముంబయి హైవే మీదుగా నగరానికి వచ్చిన బస్సులను జేబీఎస్‌, వైఎంసీఏ- సంగీత్‌, తార్నాక, జామై ఉస్మానియా వంతెన- నింబోలిఅడ్డ- చాదర్‌ఘాట్‌ మీదుగా ఎంజీబీఎస్‌కు అనుమతిస్తారు. బెంగళూరు నుంచి వచ్చే బస్సులు అరాంఘర్‌ చౌరస్తా- చాంద్రాయణగుట్ట, ఐఎస్‌ సదన్‌, నల్గొండ క్రాస్‌రోడ్సు, చాదర్‌ఘాట్‌ మీదుగా వెళ్లాలి. ప్రైవేటు బస్సులను నగరం వెలుపల నుంచి రాకపోకలకు అనుమతిస్తారు. విమానాశ్రయం నుంచి వచ్చేవారిని నెక్లెస్‌ రోడ్డు, ఎన్‌టీఆర్‌మార్గ్‌, అంబేడ్కర్‌ విగ్రహం, ఫలక్‌నుమా మెయిన్‌ రోడ్డు మీదుగా అనుమతించరు. అలాగే రైల్వే ప్రయాణికులు కూడా ఈ మార్గాల్లో వెళ్లడానికి వీలుండదు. జిల్లాలు, బయట రాష్ట్రాల నుంచి వచ్చే లారీలను ఈనెల 5, 6 తేదీల్లో రాత్రి పూట సైతం నగరంలోకి అనుమతించరు.

Don't Miss