వరంగల్ లో విషజ్వరాలు

16:53 - July 30, 2017

వరంగల్ : మలేరియా... ఈ పేరు చెబితేనే ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసులు వణికిపోతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా విషజ్వరాలతో మచంపట్టిన వారే కనిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో మలేరియా బాధితులంతా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. దీంతో ఈ పెద్దాస్పత్రికి రోజు రోజుకూ రోగుల తాకిడి పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా జర్వంతో బాధపడుతున్న 7,251 మందికి రక్త పరీక్షలు చేశారు. వీరిలో 158 మందికి మలేరియా సోకినట్టు తేలింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం, నెక్కొండ మండలాలతోపాటు వరంగల్‌ నగరంలో ఎక్కువ కేసులను గుర్తించారు. మండల కేంద్రాల్లోని ప్రాథమిక వైద్యఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో సరైన వైద్య సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తన కుమారుడికి వైద్యం అందించే విషయంలో ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎదురైన చేదు అనుభవంపై ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లి పడిన బాధ వర్ణనాతీతం
పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్న బిడ్డకు వైద్యం చేయించే విషయంలో ఈ తల్లి పడిన బాధ వర్ణనాతీతం.మలేరియానే కాదు... భయంకరమైన సెలిబ్రల్‌ మలేరియా కేసులను కూడా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గుర్తించారు. మెదడుకు సోకిన మలేరియా చికిత్సకు కూడా లొంగదు. ఇలాంటి కేసుల్లో మరణమే శరణం అవుతోంది. ప్రాణాంతక మలేరియాకు ఇంతవరకు 8 మంది బలయ్యారని ఎంజీఎం ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. సంగెం మండలం వెంటాపూర్‌కు చెందిన 55 ఏళ్ల రఘుపతి, పెద్దపల్లి జిల్లా రామన్నగూడెంకు చెందిన ఆరేళ్ల బాలిక లక్ష్మి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం దండిపెల్లికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు బంగారి రాజయ్య మలేరియా మహమ్మారి బారినపడి మృతిచెందారు. అలాగే ఆదిలాబాద్‌ జిల్లా వాసి 55 ఏళ్ల బొందుబాయి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం చెన్నరావుపేటకు చెందిన 30 ఏళ్ల యువకుడు శంకర్‌, 60 ఏళ్ల ముత్తమ్మ, 12 సంవత్సరాల తార, చెన్నారావుపేటకు చెందిన ఏడేళ్ల నందు కూడా మలేరియాతో మృతిచెందారు. ఎంజీఎం ఆస్పత్రిలో మృత్యువాతపడ్డవారిలో 13 ఏళ్లలోపు వారు ముగ్గురు ఉండటం ఆందోళనకరపరిణామం. ఇవి కేవలం అధికార గణాంకాలే. అనధికార లెక్కల ప్రకారం మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే టుంటుందని అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రికార్డులకు ఎక్కని మలేరియా మరణాలు చాలానే ఉంటాయంటున్నారు.

13 మందికి డెంగీ
మలేరియానే కాదు.. భయంకరమైన డెంగీ కూడా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రబలింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 199 మందికి రక్తపరీక్షలు నిర్వహిస్తే, 13 మందికి డెంగీ సోకినట్టు గుర్తించారు. ఈనెలలో 76 మందికి రక్తపరీక్ష చేస్తే ముగ్గురికి డెంగీ లక్షణాలు బయటపడటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. విష్వజరాలతో బాధపడుతూ ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో సరైన వైద్య సేవలు అందక వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చినా ఆరోగ్యం అంతమెరుగ్గాలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలేరియా, డెంగీ వంటి ప్రాణాంత విషజ్వరాల ప్రభావం గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, వ్యాధి నిరారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్నికోరుతున్నారు. డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందిని అందుబాటు ఉంచితే అంటువ్యాధులను కొంతవరకైనా నివారించడంతోపాటు, మరణాలను తగ్గించవచ్చని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈదిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Don't Miss